రంజీ ట్రోఫీలో సంచలనం చోటు చేసుకుంది. రోహిత్ శర్మ, జైశ్వాల్, రహానే, శ్రేయాస్ అయ్యర్, శివం దూబే, శార్దూల్ ఠాకూర్ దాదాపు అరడజను మంది టీమిండియా ప్లేయర్లతో నిండిపోయిన ముంబై జట్టుకు జమ్మూ కాశ్మీర్ షాక్ ఇచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో రాణించి పటిష్టమైన ముంబైను చిత్తుగా ఓడించింది. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 205 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూ కాశ్మీర్ ముంబై బౌలర్లను అలవోకగా ఎదుర్కుంటూ లక్ష్యాన్ని ఛేజ్ చేసింది.
ALSO READ | Ranji Trophy 2025: గిల్ వీరోచిత సెంచరీ వృధా.. పంజాబ్ ఘోర ఓటమి
స్టార్ ఆటగాళ్లు రోహిత్, జైశ్వాల్, రహానే, శ్రేయాస్ అయ్యర్, శివం దూబే ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. శార్దూల్ ఠాకూర్ మినహాయిస్తే మిగిలిన వారందరూ ఘోరంగా విఫలమయ్యారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ జట్టులో ప్రతి ఆటగాడు సమిష్టిగా రాణించడంతో టోర్నమెంట్ లో తొలి విజయాన్ని అందుకున్నారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 120 పరుగులకే ఆలౌట్ అయింది. ఉమర్ నజీర్, యుద్ వీర్ సింగ్ తలో నాలుగు వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ లో జమ్మూ కాశ్మీర్ 206 పరుగులు చేసి కీలకమైన 84 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.ఓపెనర్ శుభమ్ ఖజురియా (53) హాఫ్ సెంచరీతో రాణించాడు. రెండో ఇన్నింగ్స్ లో ముంబై మరోసారి ఫ్లాప్ షో చేసింది. 290 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో 101 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ముంబైని శార్దూల్ ఠాకూర్ (119) వీరోచిత సెంచరీతో ఆదుకున్నాడు. అతనికి కొటియన్ చక్కని సహకారం అందించాడు. 205 పరుగుల లక్ష్య ఛేదనలో జమ్మూ కాశ్మీర్ 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసి గెలిచింది.