
- బన్ జిల్లాలో 12 చోట్ల విరిగిపడిన కొండచరియలు.. వరదలకు ముగ్గురు మృతి
జమ్ము: జమ్మూకాశ్మీర్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రెండ్రోజులుగా పడుతున్న వానలకు రాంబన్ జిల్లా అతలాకుతలం అయింది. ఆదివారం జిల్లావ్యాప్తంగా ఉన్నట్టుండి కుండపోత వాన పడింది. దీంతో ఆకస్మిక వరదలు సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి రెండ్రోజుల్లో ఐదుగురు చనిపోయారని అధికారులు తెలిపారు.
వరదల్లో చిక్కుకున్న 100కిపైగా మందిని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. ఓవైపు వరదలు, ఆగకుండా కురుస్తున్న వర్షాలకు నశ్రీ, బనిహాల్ నేషనల్ హైవే మధ్య 12 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ రూట్‌లో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. అకస్మాత్తుగా వచ్చిన వరదకు చీనాబ్ వంతెన సమీపంలోని ధరంకుండ్ ప్రాంతంలో 40కి పైగా ఇండ్లు దెబ్బతిన్నాయి. అందులో 10 ఇండ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. తమ వాహనాలు కూడా వరదల్లో కొట్టుకుపోయాయని పలువురు స్థానికులు తెలిపారు.
ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులవల్లే జమ్మూలో భారీ వర్షాలు, మంచు తుఫాను సంభవించిందని వాతావారణ శాఖ తెలిపింది. ఇంతటిస్థాయి భారీ వర్షాలు, బలమైన గాలులు వీయడం ఐదేండ్లలో ఇదే ఫస్ట్ టైం అని చెప్పింది. శనివారం నుంచి ఆదివారం ఉదయానికల్లా 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. ఇది సాధారణ వర్షపాతం కంటే 575 శాతం ఎక్కువని పేర్కొంది.
జమ్మూ- శ్రీనగర్ హైవే మూసివేత
రాంబన్ జిల్లా అంతటా ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ అయిందని ప్రభుత్వ సీనియర్ అధికారి తెలిపారు. ప్రస్తుతం ప్రజలను కాపాడడమే తమ ప్రాధాన్యమని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. చాలాచోట్ల కరెంటు నిలిచిపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోందన్నారు. జమ్మూ, శ్రీనగర్ హైవేపై ట్రాఫిక్‌ను నిలిపివేశామని, వర్షాలు కొనసాగుతుండటంతో ట్రాఫిక్ పునరుద్ధరణ సాధ్యం కావడంలేదన్నారు.
కాశ్మీర్‌ను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిపే 250 కిలోమీటర్ల మేర ఉన్న కీలకమైన ఈ హైవేను మూసివేయడంతో వందలాదిమంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇదే హైవేపై పంథియాల్ సమీపంలో రోడ్డులోకి కొంతభాగం పూర్తిగా కొట్టుకుపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చిక్కుకున్న ప్రయాణికులను రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. హైవే టన్నెల్ ముందుభాగంలో కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.
పరిస్థితిపై సీఎం ఒమర్ అబ్దుల్లా సమీక్ష..పరిస్థితిని సమీక్షించేందుకు
సీఎం ఒమర్ అబ్దుల్లా ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. విపత్తు ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించాలని, ప్రజలకు అవసరమైన సహాయం చేయాలని ఆదేశించారు. అలర్ట్‌గా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని ప్రజలకు సూచించారు