- కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
- ఉదయం 8 నుంచి లెక్కింపు షురూ
చండీగఢ్/శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనున్నది. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభిస్తామని ఈసీ ప్రకటించింది. ఆయా పార్టీల ఏజెంట్లందరూ తెల్లవారుజామున ఐదు గంటలకే లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించింది. కౌంటింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా రెండు రాష్ట్రాల్లో గట్టిబందోబస్తు ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించింది.
హర్యానాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు స్టేట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ పంకజ్ అగర్వాల్ తెలిపారు. ఈ నెల 5వ తేదీన హర్యానాలోని 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 464 మంది ఇండిపెండెంట్లు, 101 మహిళలు పోటీ చేస్తున్నారు. 67.90 శాతం ఓటింగ్ నమోదైంది. ఇటీవల విడుదలైన ఎగ్జిట్‌పోల్ ఫలితాలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయి. అటు బీజేపీ నేతలు మాత్రం గెలుపుపై ధీమాగా ఉన్నారు.
వరుసగా మూడో సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా, జమ్మూ కాశ్మీర్‌లోనూ ఓట్ల లెక్కింపునకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 20 కౌంటింగ్ సెంటర్లను సిద్ధం చేసింది. ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అన్ని జిల్లాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది. అభ్యర్థులు, ఎన్నికల సిబ్బంది, ఆయా పార్టీల ఏజెంట్లను మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తామని ఈసీ అధికారులు తెలిపారు.