టెర్రరిస్టుల వేటలో తుపాకీ పట్టిన డీజీపీ

టెర్రరిస్టుల వేటలో తుపాకీ పట్టిన డీజీపీ
  • జమ్మూ కాశ్మీర్​లోని కథువాలో 
  • పోలీసుల సెర్చ్ ఆపరేషన్​ 

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌‌లోని కథువా జిల్లా సన్యాల్ అటవీ ప్రాంతంలో  దాక్కున్న ఐదుగురు టెర్రరిస్టుల ఆచూకీ కోసం భద్రతా దళాల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ మూడో రోజు మంగళవారం కూడా కొనసాగింది. ఈ ఆపరేషన్‌‌లో జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) నళిన్ ప్రభాత్ స్వయంగా ఏకే47 రైఫిల్ తో పాల్గొన్నారు. ఆయనతో పాటు ఇన్‌‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జమ్మూ జోన్) భీమ్ సైన్ టుటి, డీఐజీ (జమ్మూ-సాంబా-కతువా రేంజ్) శివ్ కుమార్ శర్మ, కథువా ఎస్ఎస్పీ శోభిత్ సక్సేనా, ఎస్పీ (ఆపరేషన్స్) నాసిర్ ఖాన్  కూడా ఉన్నారు. మంగళవారం ఉదయం భద్రతా దళాలు..టెర్రరిస్టులు దాక్కున ఏరియాలోకి ప్రవేశించాయి. 

గాలింపు చర్యల్లో పాల్గొన్న డీజీపీ

దాంతో అక్కడ టెర్రరిస్టులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగినట్లు సమాచారం. అయితే, టెర్రరిస్టులు ఉన్నారనే అనుమానంతో భద్రతా దళాలే కాల్పులు జరిపాయని..వారిపై ఎటువంటి ఎదురు కాల్పులు జరగలేదని అధికారులు వెల్లడించారు. సన్యాల్ అటవీ ప్రాంతంలో  భారీగా ఆయుధాలు ధరించిన ఐదుగురు టెర్రరిస్టులు ఇంకా ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.

ఓ జంటను బంధించిన టెర్రరిస్టులు..

పాకిస్తాన్ నుంచి ఐదుగురు టెర్రరిస్టులు ఆదివారం సరిహద్దు దాటి హిరానగర్ సెక్టార్‌‌లోని సన్యాల్ గ్రామంలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఓ జంటను టెర్రరిస్టులు బంధించారు. వ్యక్తిని బంధించగా..అతని భార్య మాత్రం అతి కష్టం మీద టెర్రరిస్టుల బారి నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత మహిళ భర్త కూడా టెర్రరిస్టుల  బారి నుంచి తప్పించుకున్నాడు. ఈ సమయంలో ఒక బాలికకు స్వల్ప గాయాలు అయ్యాయి. దాంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. 

ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు భద్రతా దళాలు సన్యాల్ చేరుకున్నాయి. ఇది గమనించి టెర్రరిస్టులు అడవిలోకి  పరారయ్యారు. జమ్మూ కాశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ కూడా ఆదివారం సాయంత్రమే ఘటనా స్థలానికి చేరుకుని అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నారు. సోమవారం ఘటనా స్థలంలో రెండు గ్రెనేడ్లు, స్లీపింగ్ బ్యాగులు, ట్రాక్‌‌సూట్‌‌లు, చిప్స్ ప్యాకెట్లు, ప్రత్యేక పాలిథిన్ సంచులను స్వాధీనం చేసుకున్నారు.