
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్లో మంగళవారం జరిగిన టెర్రర్ అటాక్‌తో టూరిస్టులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కాశ్మీర్‌కు వెళ్లాలనుకున్న పర్యాటకుల్లో 90 శాతం మంది తమ బుకింగ్‌లను క్యాన్సిల్ చేసుకున్నారని ఢిల్లీ ట్రావెల్ ఏజెన్సీలు వెల్లడించాయి. చాలా మంది టూరిస్టులు వచ్చే నెల కాశ్మీర్‌ను విజిట్ చేసేందుకు టికెట్స్ బుక్ చేసుకున్నారని, అయితే, టెర్రర్ అటాక్‌తో వాటిని క్యాన్సిల్ చేసుకుంటున్నారని ఓ ట్రావెలర్ కంపెనీ ఓనర్ తెలిపారు. మరికొంత మంది టూరిస్ట్‌లు వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు తమ షెడ్యూల్‌ను మార్చుకుంటున్నారని చెప్పారు.
టూరిస్టుల తరలింపునకు అదనపు ఫ్లైట్లు..
కాశ్మీర్ నుంచి టూరిస్టులను తరలించేందుకు శ్రీనగర్ నుంచి అదనపు ఫ్లైట్స్ సర్వీసులను నడుపుతామని బుధవారం ప్రభుత్వం ప్రకటించింది.ఈ మార్గంలో విమాన చార్జీలు కూడా అందుబాటు ధరల్లోనే ఉంటాయని వెల్లడించింది. ఇప్పటికే, బుధవారం ఉదయం 6 గంటల నుంచి 12 గంటల మధ్యలో దాదాపు 3,337 మంది ప్రయాణికులను 20 విమానాల్లో గమ్యస్థానాలకు చేర్చామన్నారు.
ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సంస్థలు శ్రీనగర్ నుంచి అదనంగా ఏడు విమానాలను నడుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు, టెర్రర్ దాడి తర్వాత జమ్మూకాశ్మీర్‌కు పెద్ద ఎత్తున ప్రయాణ బుకింగ్‌లు రద్దు అవుతున్నాయి. దీంతో టూరిస్టులకు ఉచితంగా తేదీ మార్పుతో పాటు టికెట్ల క్యాన్సలేషన్ నుంచి మినహాయింపులు అందించేందుకు ఎయిర్‌లైన్స్ సంస్థలతో పాటు హోటళ్లతో కలిసి పని చేస్తున్నామని అగ్రిగేటర్స్ సంస్థలు తెలిపాయి. దాడి తర్వాత ఫ్లైట్ టికెట్ల క్యాన్సలేషన్ 7 రెట్లు పెరిగిందని, బుకింగ్‌లు కూడా 40 శాతం తగ్గాయని క్లియర్ ట్రిప్ చీఫ్ గ్రోత్ అండ్ బిజినెస్ ఆఫీసర్ మంజరీ సింఘాల్ అన్నారు.