- ప్రజలతో నిండిపోయిన కొత్తగూడెం ప్రకాశం స్టేడియం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఖమ్మం, మహబూబాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థులు రామ సహాయం రఘురాంరెడ్డి, పోరిక బలరాం నాయక్‌కు మద్దతుగా శనివారం నిర్వహించిన జనజాతర సక్సెస్ అయ్యింది. సభలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్‌కు ప్రజలనుంచి జోష్ కనిపించింది.
రేవంత్ మాట్లాడుతుండగా కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ మద్దతు ప్రకటించారు. ‘ఈ నెల 8న రైతు భరోసాను కంప్లీట్ చేస్తాం. 9లోపు ఏ ఒక్క రైతుకు బకాయి ఉన్నా ముక్కు నేలకు రాస్తా.. లేదంటే నువ్వు ముక్కు నేలకు రాస్తావా కేసీఆర్..’ అంటూ రేవంత్ సవాల్ విసరగానే ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. పలు పంచ్ డైలాగ్‌లతో రేవంత్ ప్రజలను ఆకట్టుకున్నారు.
కార్పొరేట్లకు దోచిపెడుతున్రు..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు దోచిపెడుతోందని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌కు పైసలిచ్చి పనులు చేయించుకునే దుస్థితి పోవాలంటే మోదీని ఓడగొట్టాలన్నారు. మోదీ అనుసరిస్తున్న విధానాలతో వ్యవసాయం చేయలని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎరువులు, నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు.
మోసానికి చిరునామా కేసీఆర్ : కూనంనేని
మోసానికి చిరునామా కేసీఆర్ అని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు అన్నారు. మునుగోడులో కమ్యూనిస్టుల సహాయం తీసుకొని తర్వాత గెలిచిన తర్వాత కమ్యూనిస్టులనే మోసం చేశారని గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ టార్గెట్చేసిందని చెప్పారు. రేవంత్‌పై బీజేపీ అక్రమ కేసులు పెడుతూ దుర్మార్గ పాలనను కొనసాగించడం సరికాదన్నారు.
భారీ మెజార్టీ ఇవ్వాలి : రేణుకా చౌదరి
ఖమ్మంలో రఘురాంరెడ్డికి వచ్చే మెజార్టీ చూసి బీఆర్ఎస్కు గుండెలు అదిరిపోవాలని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. రాజ్యసభలో తాను, లోక్ సభలో రఘురాంరెడ్డి జిల్లాలోని సమస్యలపై పోరాడుతామన్నారు.
నా జీవితం ప్రజా సేవకే అంకితం : రఘురాంరెడ్డి
ఖమ్మం లోక్ సభ నుంచి తనను గెలిపిస్తే తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేస్తానని కాంగ్రెస్ అభ్యర్తి రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. దశాబ్దాల కాలంగా తమ కుటుంబం ప్రజా సేవలోనే ఉందని తెలిపారు.
కాంగ్రెస్‌కు తోడుగా లెఫ్ట్ పార్టీలు..
సభకు ప్రజలను సమీకరించడంలో కాంగ్రెస్ నేతలతో పాటు లెఫ్ట్ పార్టీలైన సీపీఐ, సీపీఎం నాయకులు కృషి చేశారు. ఉక్కపోత, మండుతున్న ఎండలోనూ ప్రజలు ఓపికతో ఉన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్టేజీమీద కళాకారులతో కలిసి ఆడిపాడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. పోలీస్‌లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, పార్లెంట్ ఎన్నికల ఇన్చార్జి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీజేఎస్ నేతలు సాబీర్ పాషా, పోతినేని సుదర్శన్, అన్నవరపు కనకయ్య, తూళ్లూరి బ్రహ్మయ్య, ఆళ్ల మురళి, బాలసాని లక్ష్మీనారాయణ, కంచర్ల చంద్రశేఖర్, వూకంటి గోపాల్‌రావు, తూమ్ చౌదరి పాల్గొన్నారు.
హామీలు మరిచిన్రు : పొంగులేటి
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం విభజన చట్టంలోని హామీలను మర్చిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలను తమ మాయ మాటలతో మోసం చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోరన్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ బీజేపీ నేతలు సిగ్గు లేకుండా చెప్తున్నారని మండిపడ్డారు. పదేండ్లు దోచుకున్నది చాలకుండా మళ్లీ దోచుకునేందుకు కేసీఆర్ వస్తున్నారని విమర్శించారు. నామా గెలిస్తే కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అవుతారంటూ కేసీఆర్ చెప్పారని, దీంతోనే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేననేది స్పష్టమైందన్నారు.
15 సీట్లు గెలవాల్సిందే : తుమ్మల
లోక్ సభ ఎన్నికల్లో 15 సీట్లు గెలిచి సీఎం రేవంత్ రెడ్డిని శక్తివంతుడిని చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ లాంటి విభజన చట్టంలోని హామీలు రావాలంటే 15 సీట్లను గెలిచి రాహూల్‌కు గిఫ్ట్‌గా ఇయ్యాలన్నారు. ఆగస్టు 15లోపు పంట రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన వారిని ఆదుకుంటామన్నారు. ఆంధ్రలో కలిసిన భద్రాచలంలోని ఐదు పంచాయతీలను తిరిగి తెచ్చుకోవాలంటే ఖమ్మం, మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.