సీఎం కేసీఆర్ మాటల గారడితో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్ పథకం ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ మాయం అవుతుందన్నట్లు సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ హామీలను కాపీ కొట్టి.. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బులు పంచుతుందన్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం బీఆర్ఎస్ చేసిన అప్పులు రాష్ట్ర ప్రజలకు భారంగా మారాయని ఆరోపించారు.
ఎన్నికల్లో డబ్బుతో రాజకీయం చేసే సంస్కృతి బీఆర్ఎస్ తోనే మొదలైందని జానారెడ్డి ఆరోపించారు. పథకాలు, పాలనతో గెలవాల్సింది పోయి విచ్చలవిడిగా డబ్బు పంపిణీతో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ను విమర్శించే అర్హత సీఎం కేసీఆర్ లేదన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు.
ఈ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తుందని చెప్పారు. 200 యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇస్తామని జానారెడ్డి చెప్పారు.