ఎలక్షన్ సమయంలో ఏ లీడర్ అయినా పోటీకి జోష్ తో రెడీ కావడం కామనే. అయితే.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ దిగ్గజం జానారెడ్డి రూటే సెపరేట్. ఎక్కువకాలం మినిస్టర్, మోస్ట్ సీనియర్ గా పేరున్న ఆయన ఇప్పుడు రాజకీయాలకు దూరం అవుతారా అన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. ఇద్దరు కొడుకులను ఎలక్షన్ బరిలోకి తెస్తారని గతం నుంచే ప్రచారం ఉన్నా ఇప్పుడే సరైన టైంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారిని పోటీలోకి దించి, తాను ఓట్ల రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యేగా పోటీచేయబోనని స్వయంగా చెబుతున్న ఆయన పొలిటికల్ రిటైర్మెంట్ కాదని మాత్రం క్లారిటీ ఇస్తున్నారు. పెద్ద పదవి చాన్స్ వస్తే మాత్రం వదులుకునేది లేదని ట్విస్ట్ కూడా ఇస్తున్నారు.
గతంలోనే పలుమార్లు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై జానారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో ఓట్ల పాలిటిక్స్ ను పక్కనబెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కొడుకులను రెడీ చేసినట్లు చెబుతున్నారు. జయవీర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి ఈసారి పోటీ చేస్తారని ఇప్పటికే అనుచరులకు సంకేతాలిచ్చారు.
నాగార్జున సాగర్ బైపోల్ ఓటమి తర్వాత సైలెంట్ అయిన జానారెడ్డి.. పీసీసీ చీఫ్ మార్పు తర్వాత కొంత యాక్టివ్ గా కనిపించారు. రేవంత్ రెడ్డికి, జిల్లా సీనియర్లకు మధ్య సమన్వయం చేసే బాధ్యత తీసుకున్నారు. జిల్లాకు చెందిన సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రెడ్డి మధ్య సీట్లపై ఒక క్లారిటీ వచ్చాక పనిలో పనిగా జయవీర్, రఘువీర్ పోటీచేసే సీట్లపై నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. రఘువీర్ మిర్యాలగూడ సీటుపై, జయవీర్ నాగార్జునసాగర్ సీటుపై ఇంట్రెస్ట్ గా ఉన్నారు. సాగర్ బైపోల్ నుంచే యాక్టివ్ గా తిరుగుతున్న జయవీర్ ఇప్పటికే జనంలో తిరుగుతున్నారు. రఘువీర్ మిర్యాలగూడలో ఆఫీస్ పెట్టారు. తండ్రితో కలిసి కార్యక్రమాలు చేస్తున్నారు.
వారసులను రంగంలోకి దించాక మరి జానారెడ్డి ఏం చేస్తారన్న చర్చ జరుగుతోంది. ఎలక్షన్ తర్వాత పార్టీ గెలుపును బట్టి తన గౌరవానికి తగ్గకుండా పదవి వస్తుందనే అంచనాల్లో ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అవసరమైతే తనకోసం ఎమ్మెల్యే పదవి వదులుకునేవాళ్లున్నారంటూ జానారెడ్డి సరదాగా చెబుతున్నారు. ఆయన ప్లాన్లు చూసి సీనియర్ సీనియరే అంటూ అనుచరులు చెప్పుకుంటున్నారు.