నల్గొండ జిల్లా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నోటీసులు ఇవ్వడంపై పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి స్పందించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న కొందరు పార్టీ నేతలు ఎవరికి వాళ్లుగా ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. పార్టీ నోటీసులకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఉందన్నారు. నాంపల్లిలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జానారెడ్డి మాట్లాడారు.
ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసే నేతలను పార్టీ అధిష్టానం ఉపేక్షించాల్సిన అవసరం లేదని జానారెడ్డి అభిప్రాయపడ్డారు. అలాంటి వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ జానారెడ్డి బతిమిలాడడని స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీల ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మాటలకు, మూటలకు మోసపోవద్దని ఓటర్లను కోరారు. దిగజారుడు వ్యవహారాలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘ నేతలు ఎలా వ్యవహరిస్తున్నరో ప్రజలు గమనిస్తున్నరు.. వాళ్లకు ప్రజలే తగిన బుద్ధి చెప్తరు’’ అని కామెంట్ చేశారు.