జానారెడ్డి ఫ్యామిలీలో ఒక్కరికా..? ఇద్దరికా టికెట్..?     

  • కొడుకు కోసం పోటీ నుంచి తప్పుకున్న జానారెడ్డి
  • నాగార్జున సాగర్‌‌ నుంచి అప్లికేషన్ పెట్టకున్న జైవీర్‌‌
  • సాగర్‌‌తో పాటు మిర్యాలగూడలోనూ అప్లై చేసుకున్న రఘువీర్
  • ఉదయ్‌ పూర్ డిక్లరేషన్‌ నేపథ్యంలో ఒక్కరికే చాన్స్‌!

నల్గొండ, వెలుగు: కొడుకుల రాజకీయ భవిష్యత్‌ కోసం మాజీ మంత్రి జానారెడ్డి పోటీ నుంచి తప్పకున్న విషయం తెలిసిందే.  వచ్చే ఎన్నికల్లో తనకు బదులు తన కొడుకులు రఘువీర్​, జైవీర్​ పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించారు.  అన్నట్టుగానే టికెట్​ కోసం ఆయన దరఖాస్తు చేయలేదు.  జైవీర్​ నాగార్జునసాగర్ కోసం అప్లై చేయగా,  రఘువీర్​ సాగర్‌‌తో పాటు మిర్యాలగూడ టికెట్​కోసం కూడా అప్లై చేశారు. కానీ,  ఉదయ్‌ పూర్‌‌ డిక్లరేషన్‌ ప్రకారం ప్రతి పార్లమెంట్​ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇవ్వాల్సి ఉండడంతో ఒక్కరికే చాన్స్‌ దక్కనుందని తెలుస్తోంది.  ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీసీల కోసం నల్గొండ సీటు త్యాగం చేస్తానని ప్రకటించడంతో జానారెడ్డి డైలామాలో పడ్డారు.  2018లో ఇదే ఈక్వేషన్స్​లో మిర్యాలగూడ స్థానం బీసీలకు ఇవ్వాల్సి వచ్చింది.  

2014లోనే ప్రయత్నించినా..

జానారెడ్డి తన పెద్దకొడుకు రఘువీర్​ రెడ్డిని 2014లో పోటీ చేయించాలని భావించారు. తాను సాగర్‌‌ నుంచి తన కొడుకును మిర్యాలగూడ నుంచి బరిలో దింపాలని గట్టిగానే ప్రయత్నాలు చేశారు. ఈ మేరకు హైకమాండ్‌కు రఘువీర్​ పేరు కూడా పంపారు.  కానీ, నల్గొండ పార్లమెంట్​ సెగ్మెంట్​లో అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన క్యాండిడేట్లే అవుతున్నారని భావించిన హైకమాండ్​ రఘువీర్‌‌కు అవకాశం ఇవ్వలేదు. ఆయన ప్లేస్​లో మరొక క్యాండేట్‌ను ప్రతిపాదించాలని కోరగా... అనివార్యంగా  జానానే ఎన్​.భాస్కర్​రావు పేరును  తెరపైకి తెచ్చారు.

2018 ఎన్నికల్లోనూ మిర్యాలగూడలో రఘువీర్​ను నిలబెట్టాలని అనుకున్నా..  పార్లమెంట్​సెగ్మెంట్​లో ఒక టికెట్​కచ్చితంగా బీసీలకు ఇవ్వాలని హైకమాండ్​ నిర్ణయించడంతో  ఆర్​.కృష్ణయ్యను బరిలో దింపాల్సి వచ్చింది.  అయితే, పీసీసీ మాజీ ప్రె సిడెంట్​ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కారణంగానే రఘువీర్‌‌కు టికెట్‌ రాలేదని అప్పట్లో జానారెడ్డి వర్గం ఆరోపించింది.  కాగా, 2014, 2018 ఎన్నికల్లోనూ కోమటిరెడ్డి బ్రదర్స్​, ఉత్తమ్ దంపతులు రెండు టికెట్లు తెచ్చుకోవడంలో సక్సెస్​ అయ్యారు. 

జానా మాట చెల్లుబాటు అయ్యేనా..?

ఏడు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీఎల్పీ లీడర్‌‌గా పనిచేసిన జానారెడ్డి మాట ఈసారైన చెల్లుబాటు అవుతుందో..? లేదోనని చర్చ జరుగుతోంది.  జానారెడ్డికి పీసీసీ ప్రెసిడెంట్​ రేవంత్​ రెడ్డి ప్రధాన అనుచరుడు కావడం, ఏఐసీసీ నేతలతో ఉన్న సంబంధాలు కలిసివస్తాయని భావిస్తున్నా.. ఫీల్ట్‌ లెవల్‌ రాజకీయాలు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి.   ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ ప్రెసిడెంట్​ వ్యవహారంలో జానా ప్రయత్నాలు బెడిసికొట్టిన సంగతి తెలిసిందే.

ఆయన ప్రధాన అనుచరుడు జడ్పీ మా జీ చైర్మన్​ కసిరెడ్డి నారాయణ రెడ్డిని డీసీసీ ప్రెసిడెంట్​ చేయాలనుకున్నారు. కానీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డం తిరగడంతో జానా ప్రయత్నాలు వర్క్​వుట్​ కాలేదు.  2014, 2018 ఎన్నికల్లో పెద్ద కొడుకును బరిలో దింపాలనుకున్నా సాధ్యపడలేదు. ఈ సారి తన సీటు త్యాగం చేసి ఇద్దరు కొడుకులను పోటీలో నిలపాలని భావిస్తున్నారు. కానీ, హైకమాండ్ ప్రతి పార్లమెంట్‌కు రెండు సీట్లు బీసీలకు ఇవ్వాలని నిర్ణయించడంతో మిర్యాల గూడ టికెట్‌పై మళ్లీ సందిగ్ధత నెలకొంది. 

జానారెడ్డి పోటీ చేయాలని ఒత్తిడి

జానారెడ్డి ఓ వైపు కొడుకుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే.. సీనియర్లు, పార్టీ క్యాడర్ మాత్రం నాగార్జునసాగర్​నుంచి ఆయనే పోటీచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. అనారోగ్య కారణాలు, కొడుకుల కోసం ఇప్పటికే ప్రత్యక్ష రాజకీయాలకు దూరమని ప్రకటించినప్పటికీ..  జానారెడ్డే పోటీ చేయాలని కోరుతున్నారు.  ఈ మేరకు సొంత పార్టీ నేతలతో పాటు ఎమ్మెల్యే భగత్​కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒకప్పటి జానారెడ్డి వర్గం కూడా ఆయనతో చర్చలు జరిపిట్లు తెలిసింది.