
హైదరాబాద్: డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా కేంద్రంపై పోరుకు దక్షిణాది రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు కేంద్రంలోని మోడీ సర్కార్‌పై యుద్ధం ప్రకటించింది. డీలిమిటేషన్ విషయంలో తమిళనాడు బాటలోనే తెలంగాణ వెళ్తోంది. ఈ క్రమంలోనే నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలను ఏకంగా చేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ సోమవారం (మార్చి 17) అఖిల పక్ష సమావేశం నిర్వహించింది.
డిప్యూటీ సీఎం భట్టి, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో అఖిల పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, బీజేపీ దూరంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీ తరుఫున ఎవరూ సమావేశానికి హాజరు కాలేదు. సీపీఐ, సీపీఎం, ఎంఐఎం ప్రతినిధులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సంద్భరంగా డీలిమిటేషన్‌పై చర్చించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణా భారత్ కు జరిగే అన్యాయం.. ఈ విషయంలో కేంద్రంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే అంశాలపై ప్రధానంగా డిస్కస్ చేసినట్లు తెలిసింది.
ALSO READ | బీసీ బిల్లు దేశానికే రోల్ మోడల్ : మంత్రి పొన్నం ప్రభాకర్
ఈ సమావేశం అనంతరం జానారెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీలిమిటెషన్‌పై ఉన్న ఆందోళనను అన్ని పార్టీలతో చర్చించి అభిప్రాయాలు తెలుసుకున్నామని అన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తెలుసుకోమని ప్రభుత్వం తనకు చెప్పిందన్నారు. డీలిమిటేషన్‌పై ఐక్యంగా పోరాడాలని ప్రాథమికంగా నిర్ణయించామని తెలిపారు. ఇది డీలిమిటేషన్ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా చేస్తోన్న పోరాటంలో తొలి అడుగు అని పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి సమావేశాలు మరిన్ని జరుగుతాయన్నారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ న్నేతృత్వంలో చెన్నైలో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ డెలిగేషన్ వెళుతుందని.. ఈ బృందంలో అన్ని పార్టీల నుండి ఒక్కొకరు హాజరవుతారని తెలిపారు. ఇక.. ఈ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ డుమ్మా కొట్టడంపైన ఆయన స్పందించారు. అఖిల పక్ష సమావేశానికి పార్టీల గైర్హాజరు తాత్కాలికమేనని.. భవిష్యత్తులో అన్ని పార్టీలు కలిసి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ విషయంలో అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో చివరకు అందరం ఒక్క దగ్గర కలుస్తామని పేర్కొన్నారు.