జానారెడ్డి కుమారుడికి నిరసన సెగ.. జైవీర్ రెడ్డిని నిలదీసిన కంపసాగర్ గ్రామస్తులు

నల్లగొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ గ్రామంలో మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడికి చేదు అనుభవం ఎదురైంది. నాగార్జున సాగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కుందూరు జైవీర్ రెడ్డికి నిరసన సెగ ఎదురైంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన జైవీర్ రెడ్డిని కంపసాగర్ గ్రామస్తులు ప్రశ్నించారు. 40 ఏళ్లుగా మీ తండ్రి జానారెడ్డి అధికారంలో ఉండి కూడా తమ గ్రామానికి  ఏం చేశాడని ప్రశ్నించారు.

జానారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక ట్రాన్స్ ఫార్మర్ కోసం ఏళ్లుగా ఎదురుచూశామని నిలదీశారు. ఏం ముఖం పెట్టుకొని ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా నోముల భగత్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఈయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. భగత్ తండ్రి నోముల నరసింహయ్య..  జైవీర్ రెడ్డి తండ్రి జానారెడ్డిపై 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత అనారోగ్యంతో నోముల నరసింహయ్య చనిపోయారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో నోముల భగత్.. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నిక బరిలో నిలబడ్డారు. ఆ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి బరిలో నిలిచి.. ఓడిపోయారు. భగత్ ఉప ఎన్నికలో 18 వేల 872 ఓట్లతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు.