నల్గొండ, వెలుగు : వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా అరంగ్రేటం చేసేందుకు సిద్ధమైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ముఖ్యనేతల కుమారులు నల్గొండ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని షురూ చేశారు. సీఎల్పీ మాజీ నేత, సీనియర్ నాయకుడు కె.జానారెడ్డి కొడుకులు రఘువీర్, జయవీర్‌రెడ్డి నాగార్జునసాగర్, మిర్యాలగూడలో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మండలి చైర్మన్‌గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. తన తాత గుత్తా వెంకట్‌రెడ్డి మెమోరియల్‌ట్రస్ట్ పేరుతో నల్గొండలో పలురకాల సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆయన కొన్ని రోజులుగా ఓన్లీ మునుగోడుపైనే ప్రత్యేక దృష్టి పెట్టారు.
జయవీర్ ‘గిరిజన యాత్ర’
జానారెడ్డి కుమారులకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు కలిగి ఉండటం రాజకీయంగా మరింత బలాన్ని సమకూర్చింది. వచ్చే ఎన్నికల్లో అన్నదమ్ముల ఇద్దరికీ టికెట్లు ఖాయమని పార్టీ హైకమాండ్ సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారానికి తెరతీసినట్లు పార్టీ ముఖ్యులు చెబుతున్నారు. నాగార్జునసాగర్‌లో కుందూరు జయవీర్‌రెడ్డి ‘బ్రింక్ బ్యాక్ కాంగ్రెస్’ పేరుతో గిరిజన చైతన్య యాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి గిరిజనులకు వివరిస్తున్నారు.
తన తండ్రి జానారెడ్డి గిరిజనుల కోసం చేసిన కృషి గురించి చెబుతున్నారు. ‘తండాకు అండా.. మన కాంగ్రెస్ జెండా’ అనే నినాదంతో పెద్దవూర, తిరుమలగిరి, నిడమనూరు, త్రిపురారం మండలాల్లో తండాల్లో జోరుగా పాదయాత్ర కొనసాగుతోంది. సాగర్‌లో గిరిజన ఓటర్లు ఎక్కువగా ఉండటంతో జయవీర్యాత్రకు ప్రాధాన్యం ఏర్పడింది. కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జయవీర్ వచ్చే ఎన్నికల్లో తండ్రి స్థానంలో సాగర్ బరిలో దిగనున్నారు. గత రెండు ఎన్నికల్లో జానారెడ్డి ఓడిపోవడం ఒక ఎత్తయితే, ఇటీవల అనారోగ్య సమస్యలు కూడా తోడవడంతో ఆయన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు చేరువయ్యేందుకు రఘువీర్ఎన్నికలకు ఐదారు నెలల ముందే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు.
సమావేశాల్లో రఘువీర్..
మిర్యాలగూడలో పోటీకి సిద్ధమైన పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి కొద్దిరోజుల కింద వైదేహీ ఎన్‌క్లేవ్‌లో సొంతంగా ఇంటిని కొన్నారు. అక్కడి నుంచే ఎన్నికల కార్యాచరణ మొదలు పెట్టారు. వారానికోసారి పార్టీ ముఖ్యులతో జూమ్ మీటింగ్‌లు పెడుతున్నారు. ఉత్తమ్, జానారెడ్డి తదితరులతో జూమ్ మీటింగ్ ద్వారా నాయకులతో పార్టీ కార్యక్రమాల గురించి చర్చలు జరుపుతున్నారు. మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో త్వరలో భేటీ అయ్యేందుకు ఏర్పాట్లు
చేసుకుంటున్నారు.
మునుగోడులో అమిత్వే‘ఢీ’..
గుత్తా కుమారుడు అమిత్‌రెడ్డి సీటు ఇంకా కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ మునుగోడులో అమిత్ ఎంట్రీ రాజకీయ వేడీ పుట్టిస్తోంది. గుత్తాకు మునుగోడు నియోజకవర్గంతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా అమిత్ వచ్చే ఎన్నికల్లో అక్కడి నుంచే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చాల్సి వస్తే నెక్ట్స్ చాన్స్ అమిత్‌కే దక్కుతుందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో కొత్త తరం యువతను రాజకీయాల్లో తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా కేటీఆర్ అండదండలతోనే అమిత్ రాజకీయాల పైన ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. నిన్నామొన్నటి వరకు నల్గొండలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణలు ఇప్పించిన ఆయన ఇటీవల మునుగోడులో సేవా కార్యక్రమాల ను స్పీడప్ చేశారు. అనారోగ్య పాలైన పేద కుటుంబాలకు, చదువు కోసం ఫీజులు కట్టలేని పేద, నిరుపేద విద్యార్థులకు అమిత్ ఆర్థిక సాయం అందిస్తున్నారు.