జనసేన జన్మస్థలం తెలంగాణే:పవన్ కళ్యాణ్

జనసేన జన్మస్థలం తెలంగాణే:పవన్ కళ్యాణ్
  • గజ్జెకట్టి ప్రజలను ప్రభావితం చేసిన గద్దర్​కు నా నివాళులు
  • జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ కల్యాణ్ 
  • రాజకీయాల్లో ఉండేందుకు సైద్ధాంతిక బాటనే ఎంచుకున్నానని వెల్లడి

పిఠాపురం: జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. జనసేన జన్మస్థలం తెలంగాణేనని వెల్లడించారు. కరెంట్ షాక్ కొట్టి చావుబతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న తనకు ప్రాణం పోశాడని తెలిపారు. ఖుషి సినిమా చూసి గద్దర్ తనను ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు. గజ్జెకట్టి ప్రజలను ప్రభావితం చేసిన ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు చెప్పారు. దాశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యానని వివరించారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో ఏర్పాటు చేసిన ‘'జయ కేతనం'’ సభలో పవన్ కల్యాణ్​ మాట్లాడారు."జనసేన జన్మస్థలం తెలంగాణ. కర్మస్థానం ఆంధ్రప్రదేశ్. నా తెలంగాణ కోటి రతనాల వీణ. కరెంట్ షాక్ కొట్టి చావుబతుకుల్లో ఉంటే కొండగట్టు అంజన్న ప్రాణం పోశాడు. దాశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యా. రుద్రవీణ వాయిస్తా.. అగ్నిధారలు కురిపిస్తాం.. అనే మాటలు నిజం చేశాం. మా జనసేన వీరమహిళలు.. రాణిరుద్రమలు. గజ్జెకట్టి ప్రజలను ప్రభావితం చేసిన గద్దర్‌‌‌‌ అన్నకు నివాళులు అర్పిస్తున్నాను. ఖుషి సినిమా చూసి గద్దర్‌‌‌‌ నన్ను ప్రోత్సహించారు.  దాశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యాను. సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్‌‌‌‌ శ్రీపతి రాముడు నన్ను ఎంతో ప్రభావితం చేశారు" అని పేర్కొన్నారు. 

నన్ను అణచివేసేందుకు అనేక కుట్రలు

"మనం నిలబడ్డాం.. పార్టీని నిలబెట్టాం. నాలుగు దశాబ్దాల టీడీపీని నిలబెట్టాం. 2019లో మనం ఓడిపోయినప్పుడు మీసాలు మెలేశారు. జబ్బలు చరిచారు. మన ఆడపడుచుల్ని అవమానించారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఇదేం న్యాయం అని వీర మహిళలు అడిగితే కేసులు పెట్టి జైళ్లలో వేశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడిని కూడా జైల్లో పెట్టారు. నన్ను అణచివేసేందుకు అనేక కుట్రలు చేశారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయబోమని చాలెంజ్ చేశారు. 21 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో, ఇద్దరు ఎంపీలతో పార్లమెంట్లో అడుగు పెట్టాం. దేశమంతా మన వైపు చూసేలా 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం" అని పవన్ వివరించారు. రాజకీయాల్లో ఉండేందుకు సైద్ధాంతిక బాటనే ఎంచుకున్నాని తెలిపారు. "అనేక ఇబ్బందులు పడి 11 ఏళ్లు పార్టీని నడిపా. మన పార్టీకి 11వ సంవత్సరం.. వాళ్లను 11 సీట్లకు పరిమితం చేశాం. నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు సినిమా ఉపకరణం మాత్రమే"అని పవన్ పేర్కొన్నారు.