
- కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ, వెలుగు : ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. వచ్చేనెల 5 నుంచి 25 వరకు జరిగే పరీక్షల నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్, ఏసీపీ చేతన్ నితిన్ తో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 17 పరీక్షా కేంద్రాల్లో 8,945 మంది స్టూడెంట్లు హాజరు కానున్నట్లు తెలిపారు. వీరిలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు 4251, సెకండ్ ఇయర్ 4694 మంది ఉన్నారన్నారు.
జనగామ జిల్లా కేంద్రంలో 9, స్టేషన్ ఘన్పూర్ లో 3, మిగిలిన 5 పరీక్ష కేంద్రాలను నర్మెట, దేవరుప్పుల, జఫర్ఘడ్, పాలకుర్తి, కొడకండ్ల మండలాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నాం 12 గంటల వరకు నిర్వహించే పరీక్షల కు ఉదయం 8 గంటల వరకే చేరుకోవాలని సూచించారు. చీఫ్ సూపరిం టెండెంట్లకు మినహా మిగతా వారికి మొబైల్ ఫోన్ అనుమతి లేదన్నారు. పరీక్షల టైంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 14416 ను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖాధికారి దినేశ్ రెడ్డి, జిల్లా వైద్య శాఖాధికారి కావూరి మల్లికార్జునరావు, డీఈఓ రమేశ్, అధికారులు పాల్గొన్నారు.