
తరిగొప్పుల మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టడం బీఆర్ఎస్ పార్టీకి విరుద్ధం అన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని గ్రహించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాను ఉన్నానని, ఇద్దరు ఎమ్మెల్సీలను కేటీఆర్ మందలించారని చెప్పారు. తనకే జనగాం టికెట్ వచ్చిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజంగా పార్టీ టికెట్ కేటాయిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేకే బాధ్యత అప్పగిస్తారని చెప్పారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రవర్తించడం పార్టీకి విరుద్ధమన్నారు. పార్టీ బాధ్యతలు కేవలం ఉద్యమాలు చేసిన వారికే తెలుస్తుందన్నారు. తప్పనిసరిగా తనకే ఎమ్మెల్యే టికెట్ వస్తుందని, ప్రజలు రెట్టింపు మెజారిటీతో గెలిపిస్తారని చెప్పారు. మూడోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులను తప్పుదోవ పట్టించిన ఎమ్మెల్సీలను పార్టీ తప్పుపడుతుందని, అమాయకులైన నాయకులను పార్టీ తప్పు పట్టదని, తిరిగి స్వాగతిస్తుందన్నారు.
ALSOREAD:ముషీరాబాద్ టికెట్ కోసం గాంధీ నగర్ కార్పొరేటర్ పావని దరఖాస్తు
తరిగొప్పుల మండలానికి నీరు అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రతిపాదన ఇస్తే రూ.104 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మాణానికి మంజూరు చేశారని చెప్పారు. ప్రణాళిక సిద్ధం చేసి మంజూరైన తర్వాత... కొంతమంది తామే రూ.80 కోట్లు మంజూరు చేయించినట్టు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని సోలిపురం అంకుశ పురం గ్రామంలో కమ్యూనిటీ భవనాలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి శంకుస్థాపన చేశారు.