జనగామ/చేర్యాల, వెలుగు : హనుమంతుడు లేని ఊరు.. కేసీఆర్ పథకాలు అందని పల్లె లేదని జనగామ బీఆర్‌ఎస్ క్యాండిడేట్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. జనగామ నియోజకవర్గం చేర్యాల మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ క్యాండిడేట్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి స్వార్థం కోసం పార్టీలు మారారని విమర్శించారు. కాంగ్రెస్ మాయమాటలను నమ్మొద్దని సూచించారు.
తాను కేసీఆర్ దూతనని, తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న కేసీఆర్‌కు అండగా నిలవాలని చెప్పారు. చేర్యాల, ఆకునూరులో కేసీఆర్‌కు చాలా మంది దోస్తులున్నారని, ఇక్కడి సమస్యల పరిష్కారానికి నిధులు ఇస్తానని ఆయనే స్వయంగా చెప్పారన్నారు. ఈ ఏరియాలో అభివృద్ధి కోసం రూ. 70 కోట్లు కావాలంటే, సీఎం రూ. 72 కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. రోడ్ల కోసం రూ. 4 కోట్ల ఎమ్మెల్సీ నిధులు కేటాయించానన్నారు. గృహలక్ష్మి ఇండ్ల మంజూరులో ఆకునూరుకు ప్రయారిటీ ఇస్తామన్నారు.