జనగామలోనే ఉంటా..అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా : పల్లా రాజేశ్వర్​ రెడ్డి

  • బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి పిలుపు

జనగామ, వెలుగు :  జనగామ లోనే ఉంటూ అభివృద్ధిని పరుగులు పెట్టాస్తానని జనగామ బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్​ రెడ్డి అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదిస్తే ఐదేళ్లు సేవకుడిగా ఉంటూ జనగామ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. మంగళవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జిల్లా కేంద్రం శివారులోని ఉషోదయ ఫంక్షన్​ హాల్​లో నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక కాంగ్రెస్​ ఆరు గ్యారెంటీల పేరుతో మరో సారి మోసం చేసేందుకు కాంగ్రెస్​ ప్రయత్నిస్తోందన్నారు. మూడోసారి బీఆర్​ఎస్​ను అధికారంలోకి తేవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏ పార్టీకి లేనంత క్రమశిక్షణ గల కార్యకర్తలు ఉన్న పార్టీ బీఆర్​ఎస్​ అన్నారు. కేసీఆర్​ పదేండ్ల పాలనలో 60 యేండ్లలో జరుగాల్సిన అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం కేసీఆర్​, కేటీఆర్ ఆధ్వర్యంలో చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను కోరారు.

విపక్షాలకు క్షేత్ర స్థాయిలో ఏజెంట్లు లేని పరిస్థితి ఉందని, అయినప్పటికీ బీఆర్​ఎస్​ క్యాడర్​ అప్రమత్తంగా ఉండి గెలిచే వరకు శ్రమించాలన్నారు. ప్రజల సంపూర్ణ సహకారంతో జనగామ ఎమ్మెల్యేగా తప్పకుండా గెలుపొందుతారన్న ధీమా వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని 9వ వార్డుల్లో పల్లా రాజేశ్వర్​ రెడ్డి, 24వ వార్డులో పల్లా సతీమణి నీలిమ మంగళవారం సాయంత్రం ఇంటింటి ప్రచారం చేపట్టారు. పల్లా గెలిస్తే జనగామ కనివినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందని హామీ ఇచ్చారు. వారి వెంట పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు.