బచ్చన్నపేట, వెలుగు : బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సంక్షేమమని, కాంగ్రెస్ వస్తే అంధకారమని, గ్యారంటీ లేని పార్టీలను నమ్మొద్దని జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన బచ్చన్నపేట మండలంలోని పడమటి కేశవాపూర్, నాగిరెడ్డి పల్లి, గంగాపూర్, నారాయణ పూర్, నక్కవాని గూడెంలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి ఇంటింటి ప్రచారం చేశారు.
సాగు, తాగు నీరు, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమాలను అందిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మూడో సారి అధికారంలోకి తేవాలని కోరారు. ప్రతీ గ్రామంలోని సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తానని అన్నారు. జనగామ ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఘట్కేసర్ లో తనకు చెందిన నీలిమా హాస్పిటల్కు రేషన్ కార్డు పట్టుకుని వెళితే పైసా ఖర్చు లేకుండా వైద్యం ఉచితంగా అందిస్తామని అన్నారు. అవసరమైతే ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయిస్తానన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కేసీఆర్ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు.