స్టేషన్​లో శ్రీహరి.. జనగామలో సస్పెన్స్​

  • బీఆర్​ఎస్​ అభ్యర్థుల ప్రకటనతో జిల్లాలో హాట్​టాపిక్​గా రాజకీయాలు

జనగామ, వెలుగు : బీఆర్​ఎస్​ అభ్యర్థుల ప్రకటన జిల్లాలో హాట్​ టాపిక్​ గా మారింది. స్టేషన్​ ఘనపూర్​ క్యాడర్​లో జోష్​ నింపగా..  జనగామలో మాత్రం సస్పెన్స్​ నెలకొంది.  రాష్ట్ర వ్యాప్తంగా దాదాపూ అన్ని సీట్లను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్​.. జనగామను  హోల్డ్​లో పెట్టారు. దీంతో ఈ సెగ్మెంట్​ క్యాండిడేట్​ ఎవరన్నది ఉత్కంఠగా మారింది. స్టేషన్​ ఘన్​పూర్​లో  సిట్టింగ్​ ఎమ్మెల్యే రాజయ్యకు మొండిచేయి ఎదురైంది. ఆ స్థానంలో కడియం శ్రీహరికి అవకాశం దక్కడంతో కడియం వర్గీయులు ఫుల్​ ఖుషిలో ఉన్నారు. పాలకుర్తిలో   ఎర్రబెల్లి దయాకర్​ తన స్థానాన్ని కాపాడుకున్నారు. 

స్టేషన్​ ఘన్​పూర్​ కడియంకే

అందరూ ఊహించినట్లుగా స్టేషన్​ ఘన్​పూర్​ టికెట్​ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి కేటాయించారు. ఇక్కడి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఈసారి టికెట్​ కష్టమని మొదటి నుంచీ  ప్రచారం జరిగింది. 2018 ఎన్నికల్లో రాజయ్య వర్సెస్​ కడియం పోటీ తీవ్రంగా ఉండగా అప్పట్లో కడియంకు సర్దిచెప్పిన హైకమాండ్​..  రాజయ్యకు టికెట్​ ఇచ్చింది.  తాజాగా ఇరువురి మధ్య పోటీ తీవ్రంగా కొనసాగింది. కానీ, సీఎం కేసీఆర్​ కడియం వైపే మొగ్గు చూపారు.   కడియం శ్రీహరి 1994 నుంచి 2009 వరకు స్టేషన్​ ఘన్​పూర్​ నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పటి ఏపీ ప్రభుత్వంలో ఇరిగేషన్​, సోషల్​ వెల్ఫేర్​, మార్కెటింగ్​, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు.

2014 మే 16 నుంచి 2015 జూన్​ 11 వరకు వరంగల్​  ఎంపీగా పనిచేశారు. ఇదే క్రమంలో ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే గత కేబినేట్​లో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను తొలగించి కడియంకు డిప్యూటీ సీఎంగా అవకాశం ఇచ్చారు. దీంతో కడియం తన ఎంపీ పదవికి రాజీనామా చేయగా ఎమ్మెల్సీగా కొనసాగిస్తూ కేబినెట్ లో కంటిన్యూ చేశారు 2018 ఎలక్షన్​  తర్వాత..  కేసీఆర్​ రెండో సారి అధికారంలోకి రాగా కడియంకు కేబినెట్​లో చోటు దక్కకపోగా  ఎమ్మెల్సీ పదవి వరించింది.  ఈ క్రమంలో త్వరలో జరుగనున్న ఎన్నికల్లో స్టేషన్​ ఘన్​పూర్​ నుంచి కడియం ఎమ్మెల్యేగా బరిలోకి దిగనున్నారు. 

పాలకుర్తిలో మళ్లీ ఎర్రబెల్లి.. 

పాలకుర్తి బీఆర్​ఎస్​ టికెట్​ మరోసారి ఎర్రబెల్లి దయాకర్​ రావుకే కేటాయించారు.  2014 ఎలక్షన్లలో టీడీపీ నుంచి పాలకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందిన దయాకర్​ రావు ఆ తర్వాత  గులాబీ గూటికి చేరారు. తదుపరి 2018లో బీఆర్​ఎస్​ అభ్యర్థిగా గెలువగా ప్రస్తుత కేబినేట్​లో పంచాయతీ రాజ్​, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. తొలుత నుంచి ఇక్కడ ఎటువంటి పోటీ లేక పోవడంతో ఈ సీటు మళ్లీ ఎర్రబెల్లికే దక్కింది. కాగా, 1982లో టీడీపీ ఆవిర్భావం టైంలో రాజకీయ ప్రవేశం చేసిన ఎర్రబెల్లి తొలిసారి 1983లో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు.  

1994 ఎలక్షన్లలో వర్థన్నపేట నుంచి బరిలో ఉండి తొలిసారి   ఎమ్మెల్యేగా  గెలుపొందారు. ఇదే స్థానం నుంచి 1999, 2004లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో వరంగల్​ పార్లమెంట్​ ఉప ఎన్నికల్లో బరిలో ఉండి గెలిచారు. 2009 డీలిమిటేషన్​లో భాగంగా పాలకుర్తి నుంచి పోటీ చేసి 4వ సారి ఎమ్మెల్యే అయ్యారు.  2014 ఎన్నికల్లోనూ 5వ సారి గెలిచారు. తదుపరి 2016లో గులాబీ గూటికి చేరిన ఆయన 2018లో 6వ సారి గెలిచారు.  ఇప్పుడు ఇక్కడి నుంచే 7వ సారి బరిలో ఉండనున్నారు.  

అందరి దృష్టి జనగామపై..

జనగామ టికెట్టు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​ రెడ్డికి ఖరారైనట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరిగింది.  దీంతో  ముత్తిరెడ్డి వర్గీయులు  తీవ్రంగా వ్యతిరేకించారు.  మొదటి జాబితాలోనే పల్లా పేరు ఉంటుందని ఎమ్మెల్సీ అనుచరులు భావించినా.. అవకాశం దక్కలేదు.  కాగా ఈనెల 25న విడుదలయ్యే రెండో విడత జాబితాలో పల్లా పేరు ఖరారు అవుతుందని ఎమ్మెల్సీ వర్గం లీడర్లు చెబుతున్నారు.

మరో వైపు తనకే సీటు ఖరారు అవుతుందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి దీమా వ్యక్తం చేస్తున్నారు. టికెట్​ల ఖరారు నేపథ్యంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఎమ్మెల్సీ కవితను సోమవారం ఉదయం కలిసి తనకే టికెట్​ కేటాయించాలని కోరారు. ఈ క్రమంలో ఇక్కడి అభ్యర్థిత్వం పెండింగ్​లో ఉండడంతో కార్యకర్తల్లో టెన్షన్​ తప్పడం లేదు.