
- మందుల నిల్వకు తప్పని ఇక్కట్లు
- పక్కా బిల్డింగ్ నిర్మాణంలో జాప్యం
జనగామ, వెలుగు : జనగామ జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మందుల నిల్వకు రక్షణ లేదు. దుమ్ము, ధూళితో కూడిన తాత్కాలిక గది స్టోర్ కొనసాగుతుంది. మెడికల్ కాలేజీ రన్ కావాలంటే తప్పనిసరిగా సెంట్రల్ డ్రగ్ స్టోర్ ఉండాలనే రూల్స్ తో ఆగమేఘాల మీద వీటిని మంజూరు చేసిన సర్కారు పక్కా బిల్డింగ్‌ల నిర్మాణం పై ఫోకస్ పెట్టలేదు. ఫలితంగా మందుల నిల్వలకు ఇబ్బంది కలుగుతోంది. జనగామ సెంట్రల్ డ్రగ్ స్టోర్ కలెక్టరేట్పార్కింగ్ఏరియాలోని ఓ గదిలో నిర్వహిస్తున్నారు..
సుమారు ఆర్నెళ్ల క్రితం ఈ సీడీఎస్ మంజూరు కాగా తొలుత జిల్లా హాస్పిటల్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేశారు. అప్పట్లో చిన్న గది చాలక పోవడంతో జిల్లా గవర్నమెంట్హాస్పిటల్, ఎంసీహెచ్హాస్పిటల్లో ఎక్కడ పడితే అక్కడ అన్నట్లు వరండాలు, బాల్కానీల్లో మందుల నిల్వలను పెట్టి పంపిణీ చేపట్టారు. సిద్ధిపేట రోడ్డు చంపక్ హిల్స్సమీపంలోని సుశీలమ్మ అనాథాశ్రమంలో కొన్నాళ్లు నిర్వహించారు. ఇటీవల అక్కడి నుంచి కలెక్టరేట్పార్కింగ్ ఏరియాలోని గదికి మార్చారు. ఈ గది కూడా సరిపోవడం లేదు. దీంతో దీని ముందు భాగంలో సైతం మందులను నిల్వ ఉంచుతున్నారు.
దుమ్మే దుమ్ము..
కలెక్టరేట్కువాహనాల రద్దీ విపరీతంగా ఉంటుంది. అధికారులే కాకుండా నిత్యం వివిధ పనులపై వచ్చేవారు ఎక్కువగా ఉండటం వల్ల పార్కింగ్ ఏరియాలో దుమ్ము రేగుతోంది. అదే ప్రాంతంలోని గదిలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ నిర్వహిస్తున్నారు. ఈ రూంను కలెక్టరేట్ లో గతంలో స్టోర్‌రూంగా వాడేవారు. ఈ స్టోర్‌రూంలోనే ఇప్పుడు సెంట్రల్డ్రగ్స్టోర్ నిర్వహిస్తుండగా మందుల నిల్వకు దుమ్ము బాధలు తప్పడం లేదు.
సౌకర్యాలేవీ...
జనగామ జిల్లాలో ఒక జిల్లా హాస్పిటల్, ఒక ఎంసీహెచ్, నాలుగు సీహెచ్‌సీలు, 12 పీహెచ్‌సీల ద్వారా వైద్య సేవలు అందుతున్నాయి. ఈ హాస్పిటల్స్ అన్నింటికీ గతంలో ఉమ్మడి వరంగల్ సీడీఎస్ నుంచి మందుల పంపిణీ జరిగేది. ఇప్పుడు ఇక్కడే సెంట్రల్డ్రగ్స్టోర్ ఏర్పాటు కావడంతో ఇక్కడి నుంచే పంపిణీ చేస్తున్నారు. సర్కారు ఇండెంట్ ప్రకారం 500 రకాలకు పైగా మందులు సీడీఎస్‌లలో ఉండాలి. 300ల రకాలు నిత్యం అందుబాటులో ఉంటున్నాయని వీటిలో 130 రకాల మందులు ఎక్కువగా రన్ అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
డిమాండ్ ఎక్కువగా ఉండే ఈ 130 రకాల మందులకు సంబంధించి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా సిరప్లు, ఇంజెక్షన్ల వంటి కొన్ని డ్రగ్స్ ను నిర్ణీత టెంపరేచర్ ఉన్న గదిలోనే నిల్వ ఉంచాల్సి ఉంటుంది. కానీ ఈ డ్రగ్ స్టోర్‌లో ఏసీలు, ఫ్రీజర్ వంటి సౌకర్యాలు లేక అవస్థలు తప్పడం లేదు. అందుకోసం అధికారులు పక్కా బిల్డింగ్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని వైద్యవర్గాలు కోరుతున్నాయి.