జనగామ అర్బన్, వెలుగు : వానాకాలం వడ్ల కొనుగోలుకు సిద్ధంగా ఉండాలని జనగామ కలెక్టర్ సీహెచ్.శివలింగయ్య ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్‌తో కలిసి జిల్లా స్థాయి వడ్ల కొనుగోలు కమిటీ సభ్యులతో శనివారం మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2023-–24 వానాకాలం సీజన్‌లో వడ్ల కొనుగోళ్లకు ఐకేపీ ఆధ్వర్యంలో 80, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 97 మొత్తం 177 సెంటర్లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. జిల్లాలో 28 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉన్నాయన్నారు.
ఈ సీజన్‌లో 2.30 లక్షల టన్నుల వడ్ల దిగుబడి రావొచ్చన్నారు. సమావేశంలో డీఆర్డీవో వసంత, ఏసీపీ కె.దేవేందర్‌రెడ్డి, ఆర్టీవో శ్రీనివాసరావు, డీసీఎస్‌వో ఎం.రోజారాణి, మార్కెటింగ్ డీఎం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం పత్తి కొనుగోళ్లపై రివ్యూ నిర్వహించారు. పత్తికి మద్దతు ధర పొందాలంటే ఆధార్, బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించుకోవాలని సూచించారు. రైతులు క్వాలిటీ పత్తిని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ సుహాసిని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఏం గోడౌన్‌ను తనిఖీ చేశారు.