జనగామ జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్​ సేవలకు మోక్షం ఎప్పుడో..?

జనగామ జిల్లా ఆస్పత్రిలో  సిటీ స్కాన్​ సేవలకు  మోక్షం ఎప్పుడో..?
  • జనగామ జిల్లా ఆస్పత్రిలో ఎనిమిదేండ్లుగా మూలనపడ్డ మెషినరీ
  • నాలుగు నెలల కింద రూ.2 కోట్లతో కొత్త మెషినరీ మంజూరు
  • నేటికీ మొదలు కాని ఇన్​స్టాలేషన్​ 
  • రోగులకు తప్పని ఇబ్బందులు 

జనగామ, వెలుగు : ఎనిమిదేండ్ల కింద జనగామ జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్​ యంత్రం పనిచేయకపోవడంతో మూలకుపడింది. కొత్త మెషినరీ కావాలని పలుమార్లు ప్రతిపాదనలు పంపగా, గత డిసెంబర్​లో రూ.2 కోట్లతో కొత్త మెషినరీ మంజూరైంది. కానీ, నేటికీ ఇన్​స్టాలేషన్​ పనులు చేపట్టకపోవడంతో రోగులు ప్రైవేట్​ సెంటర్లకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. 

పనుల్లో తీవ్ర జాప్యం..

జనగామ మీదుగా వరంగల్–హైదరాబాద్, సిద్దిపేట–సూర్యాపేట హైవేలు వెళ్తుంటాయి. ఈ రోడ్లపై జరిగి ప్రమాదాల్లో క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తీసుకువస్తుంటారు. జిల్లా వాసులతోపాటు యాదాద్రి జిల్లా ఆలేరు, గుండాల మండలాలు, సిద్దిపేట జిల్లాకు చెందిన చేర్యాల, మద్దూరు తదితర మండలాలకు చెందిన వారు ఈ ఆస్పత్రిపైనే ఆధారపడుతుంటారు. ఈక్రమంలో ఇక్కడ సిటీ స్కాన్​సేవలు అత్యవసరంగా మారాయి. గతంలో ఇక్కడ సూపరింటెండెంట్లుగా పనిచేసిన వారు చూసీచూడనట్లు వ్యవహరించడంతో కొత్త మెషినరీ మంజూరు జరుగలేదనే ఆరోపణలు ఉన్నాయి.

 జనగామలో మెడికల్​ కాలేజీ మంజూరైన నేపథ్యంలో ఇక్కడి ఆస్పత్రి సూపరింటెండెంట్​ మారడం, కలెక్టర్​ రిజ్వాన్‌‌బాషా షేక్​ప్రత్యేక చొరవ తీసుకోవడంతో లేటెస్ట్​ టెక్నాలజీతో కూడిన కొత్త సిటీ స్కాన్​ యంత్రం మంజూరైంది. గత డిసెంబర్​ 13న కలెక్టర్​ను కలిసిన కేనన్​ కంపెనీ ప్రతినిధులు మెషినరీ చెన్నై నుంచి రెండుమూడు రోజుల్లో జనగామకు చేరుకుంటుందని, ఇన్​స్టాలేషన్​ప్రక్రియకు రెండు నెలలు పడుతుందని, ఫిబ్రవరి లో సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పినా పనులు జరుగలేదు. కాగా, మార్చి 26న సిటీ స్కాన్​ మెషిన్​ జిల్లా ఆస్పత్రికి తీసువచ్చారు. ముందు టీ హబ్​ సెంటర్లో దీనిని ఏర్పాటు చేయాలని భావించినా, సేఫ్టీ కారణంతో జిల్లా ఆస్పత్రిలోని పాత యంత్రం స్థానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

ఆ గదికి అవసరమైన కరెంట్, ఇతర వసతులను ఆస్పత్రి సూపరింటెండెంట్​చేయించారు. కానీ, ఇన్​స్టాలేషన్​ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఈ పనులను కేనన్​ కంపెనీకి చెందిన ఎర్బిస్​ ఏజెన్సీ చేపట్ట నుండగా పాత యంత్రం తొలగింపు పనులు ఇంకా మొదలు కానేలేదు. కొత్త యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకే సుమారు రెండు నెలల టైం పట్టనున్నట్లు వైద్య వర్గాలు చెబుతున్నాయి.  

రోగులకు తప్పని ఆర్థిక ఇబ్బందులు..

జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సిటీ స్కాన్​ సేవలు లేకపోవడంతో స్థానికంగా ప్రైవేట్​ సిటీ స్కాన్​సెంటర్లు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. సిటీ స్కాన్​కు ఒక్కో పేషంట్​నుంచి రూ.2,500ల వరకు వసూలు చేస్తున్నారు. కమిషన్ల కోసం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే రోగులకు అవసరం ఉన్నా, లేకున్నా సిటీ స్కాన్​ టెస్టులు రాస్తూ కొందరు డాక్టర్లు, సిబ్బంది దందాకు తెరలేపారనే ఆరోపణులు కూడా ఉన్నాయి. తప్పని పరిస్థితుల్లో రోగులు సదరు ప్రైవేట్​ సెంటర్లకు వెళ్లి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. మరో వైపు ప్రైవేటు సెంటర్ల నిర్వాహకులు రేడియాలజిస్ట్​లు లేకుండానే నిర్లక్ష్యంగా రిపోర్టులు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 

త్వరలోనే సేవలు అందుబాటులోకి..

జనగామ జిల్లా ఆస్పత్రిలో సిటీ స్కాన్​ సేవలు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రూ.2 కోట్ల విలువైన అధునాతన మెషినరీ ఇప్పటికే ఆస్పత్రికి చేరింది. పాత యంత్రాన్ని తొలగించి దాని స్థానంలో కొత్త మెషనరీ అమర్చనున్నాం. ఇందుకోసం సదరు ఏజెన్సీ ఇన్​స్టాలేషన్​ పనులు చేపడుతోంది.

గోపాల్​రావు, జిల్లా ఆస్పత్రి​ సూపరింటెండెంట్, మెడికల్​ కాలేజీ ప్రిన్సిపల్, జనగామ