- బ్యాంకుకు తీసుకువెళ్తున్న సిబ్బంది
- క్యూఆర్ కోడ్ లేకపోవడంతో స్వాధీనం
- సూర్యాపేటలో 130 కిలోల వెండి సీజ్
రఘునాథపల్లి, వెలుగు : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల టోల్ ప్లాజా వద్ద బుధవారం సాయంత్రం రూ. కోటి 37 లక్షల 50 వేలు నగదును రఘునాథపల్లి పోలీసులు సీజ్ చేశారు. శివునిపల్లి, తొర్రూర్ స్టేషన్ ఘనపూర్ ఎస్బీఐ బ్యాంకుల నుంచి సీఎంఎస్ వాహనం ఇన్చార్జి మురళీధర్ రెడ్డి, ఎస్కార్ట్ సిబ్బంది కలిసి నగదును జనగామ ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్‌కు తరలిస్తుండగా సరైన క్యూఆర్ కోడ్ లేకపోవడం, పేపర్లు చూపించకపోవడంతో వాహనంతో పాటు సీజ్ చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం బ్యాంకర్లు క్యూఆర్ కోడ్ తోనే నగదును తీసుకు వెళ్లాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు స్టేషన్ ఘనపూర్ ఏసీపీ శ్రీనివాస్ రావు , రఘునాథపల్లి రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్సై రఘుపతి, స్టేషన్ ఘనపూర్ ఎస్సై హరికృష్ణ ఉన్నారు.
సూర్యాపేటలో...
సూర్యాపేట : సూర్యాపేటలో పేపర్లు లేకుండా నిల్వ ఉంచిన 130 కిలోల వెండి, రూ.3 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వెండి విలువ రూ.కోటి పైగా ఉంటుందని అంచనా. రాజస్తాన్‌కు చెందిన ఉత్తమ్ సింగ్ సూర్యాపేటలోని అలంకార్ రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో ఉంటూ హోల్ సేల్ వెండి వ్యాపారం చేస్తున్నాడు. ఇతడి దగ్గర భారీగా వెండి ఉందన్న సమాచారంతో పోలీసులు, ఫ్లయింగ్ స్కాడ్ బుధవారం తనిఖీలు చేయగా 130 కిలోల వెండి దొరికింది. దీనికి సంబంధించి ఆధారాలు చూపకపోవడంతో సీజ్ చేసి కలెక్టరేట్ కు తరలించారు. తనిఖీల్లో ఎఫ్‌సీటీ ఆఫీసర్ జగన్, వరుణ్, సీఐ నాగార్జున గౌడ్, ఎస్సై మహీందర్ ఉన్నారు.