
జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో అకాల వర్షాలు రైతులకు అపార నష్టం మిగిల్చాయి. ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వానలకు వరి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశాలతో సోమవారం జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ రామారావు నాయక్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్‌తోపాటు సిబ్బంది క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు. చిల్పూర్, పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, లింగాల ఘన్పూర్, తరిగొప్పుల, జనగామ మండలాల్లో మొత్తంగా 4,539 ఎకరాల్లో వరి, మామిడి పంటలు నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.
చిల్పూర్ మండలంలో 1010 ఎకరాల్లో వరి, దేవరుప్పుల మండలంలో 88 ఎకరాల్లో వరి, 4 ఎకరాల మామిడి తోట కలిపి మొత్తం 92 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. జనగామ మండలంలో వరి 2291, మామిడి తోట 367 ఎకరాలతో కలిపి 2658 ఎకరాల్లో, కొడకండ్ల మండలంలో వరి 74 ఎకరాల్లో, లింగాల ఘనపురం మండలంలో వరి 240 ఎకరాల్లో, మామిడి తోట 125 ఎకరాల్లో, పాలకుర్తి మండలంలో వరి 280 ఎకరాల్లో, తరిగొప్పుల మండలంలో వరి 60 ఎకరాలతో కలిపి వరి పంట 4,043 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
మామిడి తోటలు 496 ఎకరాల్లో నష్టం కాగా మొత్తం 4,539 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లుగా అంచనాలు వేశారు. జనగామ మండలంలోని పెంబర్తి, ఎల్లంల, సిద్దెంకి గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వేర్వేరుగా పంటనష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు ఉన్నతాధికారులు, వ్యవసాయ శాఖ, ఇన్చార్జి మంత్రులకు ఫోన్ చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.