సౌలతులు ఇట్ల.. సదువులు ఎట్లా?

  • మెడికల్​ కాలేజీలో వసతుల లేమి
  • వేధిస్తున్న సిబ్బంది కొరత
  • వచ్చే విద్యాసంవత్సరం క్లాసులు ఎక్కడో నో క్లారిటీ 
  • సర్కారు  స్పందించకపోతే సమస్యలే..

జనగామ, వెలుగు : జనగామ గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీలో వసతులు కరువయ్యాయి.   బీఆర్​ఎస్​ సర్కారు ఆగమేఘాల మీద కాలేజీ ఏర్పాటు చేసి..  అరొకర  వసతులతోనే   కాలేజీ ప్రారంభించి చేతులు దులుపుకున్నది.   గత ప్రభుత్వం చేసిన లోపాలు ఇప్పుడు  సమస్యగా మారుతున్నాయి.  తాత్కాళికంగా రేకుల షెడ్లలో   తరగతులు  నిర్వహిస్తున్నారు. పక్కా బిల్డింగ్​ నిర్మాణ పనులు అడుగు కూడా ముందుకు కదలడం లేదు. స్టాఫ్​ కొరత వేధిస్తోంది.  వచ్చే విద్యా సంవత్సరం క్లాసులు ఎక్కడ నిర్వహించేది క్లారిటీ లేకుండా పోయింది. ప్రస్తుత కాంగ్రెస్​  సర్కారు వెంటనే స్పందించి చర్యలు చేపడితే తప్పా..  వచ్చే అకడమిక్​ ఇయర్​ నిర్వహణ గండం నుంచి గట్టెక్కే పరిస్థితులు ఉన్నాయి.

అరకొర స్టాఫ్​ 

మెడికల్​ కాలేజీ నిర్వహణ సజావుగా సాగాలంటే ఎన్​ఎంసీ రూల్స్​ ప్రకారం సరిపడా స్టాఫ్​ ఉండాలి. కేటాయించిన స్టాఫ్​ లో కనీసం 75 శాతం మేర స్టాఫ్​ అందుబాటులో ఉంటేనే ఎన్​ఎంసీ ఆఫీసర్లు అంగీకరిస్తారు. అయినా గత సర్కారు   ఇవేమీ పట్టకుండా.. అరకొర స్టాఫ్​ను కేటాయించింది. కాలేజీలో 41 రకాల క్యాడర్​ ఉండాల్సి ఉండగా అన్ని విభాగాల్లోనూ పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.   కీలకమైన ప్రిన్సిపాల్​, మెడికల్​ సూపరింటెండెంట్​ పోస్టుల్లో కూడా ఇన్​చార్జి అధికారులే ఉన్నారు.  27 మంది ప్రొఫెసర్లకు 10 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.30 మంది అసోసియేట్​ ప్రొఫెసర్​ పోస్టులకు 16 మందే ఉన్నారు. 

14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 58 మంది అసిస్టెంట్​ ప్రొఫెసర్లకు 44 మందే ఉండగా మిగిలిన 14 ఖాళీగా ఉన్నాయి. ఎపిడమాలజిస్ట్​ కమ్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టు ఖాళీగానే ఉంది. ఆర్ఎంఓ(సివిల్​ సర్జన్​), ఆర్​ఎంఓ(డిప్యూటీ సివిల్​ సర్జన్​), బయోకెమిస్ట్​ పోస్టులు వేకెంట్​ గా ఉన్నాయి. అసిస్టెంట్​ డైరెక్టర్​(అడ్మిన్​) రెండు పోస్టుల్లోనూ లేరు. నలుగురు అడ్మినిస్ట్రేటివ్​ ఆఫీసర్లకు ముగ్గురే ఉన్నారు. ఆఫీస్​ సూపరెంటెండెంట్​లు ఆరు పోస్టులకు నలుగురు ఉన్నారు. జూనియర్​ అసిస్టెంట్​లు 13 మందికి ఒక్కరే ఉన్నారు. మెడికల్​ రికార్డ్​ ఆఫీసర్​, స్టాటిస్టీసియన్​, ఈసీటీ టెక్నీషియన్​ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. గ్రేడ్​ వన్ ల్యాబ్​ టెక్నీషియన్​ పోస్టులు అయిదింటికి 5 ఖాళీగానే ఉన్నాయి. 

గ్రేడ్​ 2 ల్యాబ్​ టెక్నీషియన్​ లు 24 కు 24, ఫార్మసిస్ట్​ సూపర్​వైజర్​ పోస్టు, గ్రేడ్​ వన్​ పార్మసిస్ట్​ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. వీటితో పాటు గ్రేడ్​ 2 ఫార్మసిస్ట్​ 5కు 5పోస్టులు,స్టాటిస్టీసియన్​ కమ్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టు, మెడికల్​ ఆఫీసర్​ ఆఫ్​​ హెల్త్​(సివిల్​ అసిస్టెంట్​ సర్జన్​), లేడీ మెడికల్​ ఆఫీసర్​ పోస్టులు ఇద్దరేసి చొప్పున ఉండాల్సి ఉండగా ఇవీ ఖాళీనే. బ్లడ్​ బ్యాంక్​ మెడికల్​ ఆఫీసర్​ రెండింటికి రెండు, క్యాజువాలిటీ మెడికల్​ ఆఫీసర్​ ఆరింటికి ఆరు, గ్రేడ్​ 2 మెడికో సోషల్​ వర్కర్​ పోస్టులు రెండింటికి రెండు ఖాళీనే ఉన్నాయి. హెల్త్​ ఇన్స్​పెక్టర్​, హెల్త్​ ఎడ్యుకేటర్​లు ఇద్దరేసి ఉండాల్సి ఉండగా ఇవీ ఖాళీనే. లైబ్రేరియన్​, అసిస్టెంట్​ లైబ్రేరియన్​ వంటి పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. 

వచ్చే అకడమిక్​ ఇయర్​ ఎక్కడ?

సుమారు రూ 59 కోట్లతో చంపక్​ హిల్స్​ వద్ద నిర్మించిన కాలేజీ తాత్కాలిక షెడ్లలో ప్రస్తుతం ఫస్ట్​ ఇయర్​ స్టూడెంట్స్​ చదువుతుండగా మరో ఆర్నెళ్లల్లో సెకండ్​ ఇయర్​ క్లాసులు స్టార్ట్​ కానున్నాయి. ఇప్పుడున్న రెండు తాత్కాళిక రేకుల షెడ్​లు ఫస్ట్​ ఇయర్​ వారికే సరిపోనున్నాయి. సెకండియర్​ స్టూడెంట్లకు క్లాసులు ఎక్కడ నిర్వహించాలనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రం లోని సిద్ధిపేట రోడ్డులో గీతాశ్రమం సమీపంలో పక్కా బిల్డింగ్​ నిర్మాణానికి గత సర్కారు స్థల కేటాయింపు చేసింది. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్​ సదరు స్థలం రోడ్డు ముఖం వైపు రేకులతో ప్రహరీ ఏర్పాటు చేసి వదిలేశారు. 

ఈ నేపథ్యంలో సెకండ్​ ఇయర్​ స్టూడెంట్లకు హాస్టల్​ ఫెసిలిటీ, క్లాసుల నిర్వాహణ, ల్యాబ్​ల నిర్వాహణకు బిల్డింగ్​ ల అన్వేషణ అనివార్యంగా మారింది. చంపక్​ హిల్స్​ సమీపంలోనే ఉన్న కోమటిరెడ్డి సుశీలమ్మ వృద్దాశ్రమంలో కొంత భాగాన్ని విద్యార్థినులకు, ప్రస్తుతం ఎంసీహెచ్​ పక్కన ఉన్న సర్కారు బిల్డింగ్​లో నిర్వహిస్తున్న మెన్స్​ హాస్టల్​ పైనే మరో ఫ్లోర్​ నిర్మించి మెన్స్​ కు హాస్టల్​ ఫెసిలిటీ కల్పించాలనే యోచనలో ఆఫీసర్లు ఉన్నారు. ఇక క్లాసుల కోసం ఎంసీహెచ్​ సమీపంలోని క్రిటికల్​ కేర్​ యూనిట్​ కొత్త బిల్డింగ్​ నిర్మాణం పై మరో ఫ్లోర్​ వేయించి నిర్వహించాలని భావిస్తున్నారు. ఇది కార్యరూపం దాల్చేందుకు సర్కారు వెంటనే చర్యలు చేపట్టాలని స్టూడెంట్స్​ కోరుతున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం 
 

ఫస్ట్​ ఇయర్​ క్లాసులను తాత్కాళికంగా నిర్మించిన షెడ్​లలో ఉన్నంతలో నిర్వహిస్తున్నం. సెకండ్​ ఇయర్​ క్లాసులకు మరో ఆర్నెళ్ల టైం ఉంది. మరో 100 మంది స్టూడెంట్ల అడ్మిషన్లు వచ్చే అవకాశం ఉంది. వీరికి హాస్టల్​ ఫెసిలిటీ, క్లాస్​ రూంల అవసరాల పై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. సిబ్బంది కొరత మిగతా జిల్లాల మెడికల్​ కాలేజీలతో పోలిస్తే జనగామ బెటర్. మౌళిక వసతులను మరింత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తం. - డాక్టర్​ గోపాల్​ రావు, గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీ ప్రిన్సిపాల్​, జనగామ