గ్రీవెన్స్​లో కలెక్టర్​ ముందు రోదించిన జనగామ మున్సిపల్​ కమిషనర్

జనగామ, వెలుగు : జనగామ మున్సిపల్​ కమిషనర్​ రజిత... కలెక్టర్​ శివలింగయ్య, అడిషనల్ ​కలెక్టర్​ ప్రపుల్​ దేశాయ్​ ముందే కన్నీరు పెట్టుకున్నారు. గ్రీవెన్స్​లో అందరు చూస్తుండగానే బోరున విలపించారు. ఆర్డీఓ మధుమోహన్​ తనను అటెండర్​ కంటే హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ కలెక్టరేట్​లో సోమవారం గ్రీవెన్స్​నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి మున్సిపల్​ సమస్యపై వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చాడు. ఈ క్రమంలో ఆర్డీఓ మధుమోహన్ ​చివర కూర్చున్న కమిషనర్ ​రజితను ఉద్దేశించి ‘ఏయ్ ​ఎక్కడ చూస్తున్నవ్​.. పిటిషన్​ వచ్చింది ఇక్కడకు రా’ అని అనడంతో కలత చెందిన ఆమె కలెక్టర్​ముందుకు ఏడ్చుకుంటూ వచ్చారు. చాలా రోజుల నుంచి ఆర్డీఓ తనను కావాలనే ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. స్పందించిన కలెక్టర్​ ఏమైనా సమస్య ఉంటే తన ఛాంబర్​కు వచ్చి చెప్పాలని సూచించారు.

ఈ సందర్భంగా రజిత మాట్లాడుతూ తాను కమిషనర్​గా బాధ్యతలు చేపట్టక ముందు నెల్లుట్ల చెరువులో బతుకమ్మ పండుగ సందర్భంగా లేబర్​ కోసం రూ.30 వేలు ఇవ్వాలని ఫోర్స్​ చేయగా కౌన్సిల్​ తీర్మానం లేకుండా ఇవ్వలేనని చెప్పాననన్నారు. దీంతో పాటు మరికొన్ని ఘటనలను మనసులో పెట్టుకుని కనీస గౌరవం ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడన్నారు. టాస్క్​ఫోర్స్​ పేరిట తనకు సమాచారం ఇవ్వకుండానే పట్టణంలో ఇండ్లు కూల్చివేస్తున్నాడన్నారు. అడిగితే తాను ఆర్డీఓనని, నీకు చెప్పాలా అని సమాధానమిస్తున్నాడన్నారు. అయితే ఆర్డీఓ మాట్లాడుతూ తాను అకారణంగా ఏం అనలేదని, కమిషనర్​ విధుల్లో నిర్లక్ష్యంగా ఉండడంతో కలెక్టర్​దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు.