జనగామలో మిషనరీ చోరీ చేస్తున్న తండ్రీకొడుకులు అరెస్ట్

జనగామ అర్బన్, వెలుగు:  కాంక్రీట్ మిలర్లను చోరీ చేస్తున్న తండ్రీకొడుకులను జనగామ పోలీసులు పట్టుకున్నారు. డీసీపీ పి.సీతారాం శుక్రవారం తన ఆఫీసులో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏపీలోని పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం సోలాస గ్రామానికి చెందిన తిరుపతి శివయ్య తన ఇద్దరు కొడుకులు హరికృష్ణ, బాలయ్యతో కలిసి బతుకుదెరువు కోసం తెలంగాణకు వచ్చారు. కొన్నిరోజులు కరీంనగర్​జిల్లా హుస్నాబాద్​లోని పెట్రోలు బంకులో పనిచేశారు.

జీతం సరిపోకపోవడంతో ముగ్గురూ కలిసి చోరీలు ప్లాన్​చేశారు. అలా సిద్దిపేటలో రెండు కాంక్రీట్ మెషీన్లను కొట్టేసి జనగామకు తీసుకొచ్చారు. జనగామ రైల్వేస్టేషన్ వద్ద మరో మెషీన్ ను చోరీ చేశారు. మూడింటిని వడ్లకొండ రోడ్డులోని చెట్లల్లో దాచిపెట్టారు. మిల్లర్​మిస్​అయినట్లు జనగామలో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు శుక్రవారం వడ్లకొండ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న శివయ్య, హరికృష్ణ, బాలయ్యను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మిల్లర్ల చోరీ విషయం బయటపడింది. వాటిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్​చేసినట్లు డీసీపీ వెల్లడించారు.