నష్ట పరిహారం తేల్చట్లే..! జనగామ – సిద్దిపేట బైపాస్​ పనుల్లో ఇష్టారాజ్యం

నష్ట పరిహారం తేల్చట్లే..! జనగామ – సిద్దిపేట బైపాస్​ పనుల్లో ఇష్టారాజ్యం
  • నోటీసులియ్యకుండనేప్లాట్ల చదును
  • ప్లాట్లు కోల్పోతున్నబాధితులు 300 మందికి పైనే..
  • అధికారుల చుట్టూతిరుగుతున్నా పట్టింపేలేదు
  • న్యాయం కోరుతున్న బాధితులు

జనగామ, వెలుగు : జనగామ – సిద్దిపేట బై పాస్​రోడ్డు పనులు పేదల పాలిట శాపంగా మారాయి. ఏండ్ల కింద కొన్న ప్లాట్లకు కనీసం నోటీసులు ఇవ్వకుండానే రోడ్డు కోసం ఇష్టారాజ్యంగా చదును చేస్తున్నారు. పనులు స్పీడప్​ చేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పరిహారం తేలుస్తలేరు..

రవాణా సౌకర్యాన్ని మరింత మెరుగు పర్చేందుకు సర్కారు జనగామ–సిద్దిపేట జాతీయ రహదారులను కలుపుతూ బైపాస్​ రోడ్డు నిర్మాణం చేపడుతోంది. ఇందులోభాగంగా జనగామ హైదరాబాద్​ రోడ్​లోని ఏకశిలా బీఈడీ కాలేజీ (హెచ్​పీ పెట్రోల్​పంప్)​ సమీపం నుంచి బాణాపురం మీదుగా సిద్దిపేట రోడ్డులోని పసరమడ్ల వరకు( సుశీలమ్మ వృద్ధాశ్రమం) బై పాస్​రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తైతే హైదరాబాద్​వైపు నుంచి వచ్చే ప్రయాణికులు జనగామ టౌన్​లోకి రాకుండా బైపాస్​మీదుగా సిద్దిపేట హైవేకి చేరుకుని వెళ్లొచ్చు. 

ఇంత వరకు బాగానే ఉన్నా.., ఈ పనుల కారణంగా సుమారు 350 నుంచి 400ల మందికి చెందిన ప్లాట్లు రోడ్డు నిర్మాణం కింద పోతున్నాయి. వీటికి పరిహారం తేల్చకుండానే పనులు చేస్తుండడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. న్యాయం చేయాలని ఆర్డీవో ఆఫీస్, కలెక్టరేట్ కు ప్రదక్షిణలు చేస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. భవిష్యత్​లో భరోసా ఉంటుందని ప్లాట్లు కొంటే ఇప్పుడవి రోడ్డు పనుల్లో పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు ప్రాంతంలో గజానికి రూ.15 వేల వరకు ధరలున్నాయని, ఎంత పరిహారం ఇస్తారనేది కూడా చెప్పడం లేదంటున్నారు. పైసా పైసా కూడబెట్టుకుని ప్లాట్లు కొంటే పనికిరాకుండా పోయే పరిస్థితి వచ్చిందంటున్నారు. 

అగ్గువ సగ్గువ చెప్తున్నరు..

రోడ్డు పనులు జరిగే చోట మార్కెట్​ధర గజానికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు ధర ఉంటే అధికారులు మాత్రం అక్కడ సర్కారు ధర రూ.1,600లు ఉన్నట్లు చెబుతున్నారని బాధితులు చెప్పారు. ప్లాట్లకు ఎల్ఆర్ఎస్​ చేయించకుంటే గజానికి రూ.800లు మాత్రమే చెల్లిస్తామని అంటున్నట్లు వాపోయారు. ఏండ్ల కింద కొన్న ప్లాట్లు ఆర్థికంగా కలిసి వస్తాయనుకుంటే అసలుకే ఎసరు వచ్చిందంటున్నారు. ఈ క్రమంలో ప్లాట్ల బాధిత కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్​రిజ్వాన్​బాషా షేక్​ను కలిసి వినతి పత్రం అందించింది. గజానికి రూ.15 వేలు నష్టపరిహారం ఇప్పించి న్యాయం చేయాలని వేడుకుంది.

20 ఏండ్ల కింద కొన్న..

భవిష్యత్​ అవసరాలకు అక్కెరకు వస్తదని 20 యేండ్ల కింద 100 గజాల ప్లాటు కొన్న. ఇప్పుడది బైపాస్​ రోడ్​లో పోతోంది. నోటీసులు ఇవ్వకుండానే రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్​ చదును చేసిండు. దీనిపై ఆర్డీవోను, కలెక్టరేట్​ లో కలిసినా ఎవరూ పట్టించుకుంటలేరు. మార్కెట్​ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలె. మాసాన్​పల్లి బాలాజీ, బాధితుడు

బిడ్డ పెండ్లి కోసం కొన్న.. 

బిడ్డ పెండ్లికి అక్కెరకు వస్తదని పన్నేండ్ల కింద 100 గజాల ప్లాటు కొనుకున్న. బైపాస్​ రోడ్డు కోసం నాకు చెప్పకుండానే చదును చేసిన్రు. ఎవరిని అడిగినా పట్టించుకుంటలేరు. అగ్గువ సగ్గువ ధర ఇస్తమంటున్నరు. మార్కెట్​ధర ప్రకారం ధర ఇచ్చి ఆదుకోవాలి. లేదంటే బాధితులం అంతా కలిసి ఆందోళనలు ఉధృతం చేస్తం. ముక్రం పాషా, బాధితుడు