సంపత్ ​రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు

సంపత్ ​రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు

స్టేషన్​ఘన్​పూర్​(చిల్పూరు), వెలుగు: బీఆర్​ఎస్​ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన జనగామ జడ్పీ చైర్మన్, పార్టీ​జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్​రెడ్డి హఠాన్మరణం చాలా బాధాకరమని ఆ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని, ఆయన కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని తెలిపారు. సోమవారం గుండెపోటుతో సంపత్​రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరంలోని సొంతింట్లో ఆయన పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఉదయం కేటీఆర్​రాజవరం చేరుకొని సంపత్​రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించి, అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం ఆయన​మీడియాతో మాట్లాడారు. సంపత్​రెడ్డి.. 14 ఏండ్ల పాటు కేసీఆర్​ వెంట సైనికుడిలా ఉండి  పనిచేశారన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా క్రియాశీలకంగా పనిచేశారని, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను నిబద్ధతతో విజయవంతం చేశారన్నారు. సంపత్​రెడ్డి కుటుంబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామన్నారు. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల జడ్పీ చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు పార్టీ ఆఫీసుల్లో సంపత్​రెడ్డి మృతికి నివాళులు అర్పించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.