జనగామ, వెలుగు: ఫార్మసిస్ట్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ జనగామ డీఎంహెచ్ఓ ఏసీబీకి చిక్కాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ మండలం ఓబుల్ కేశవాపూర్పీహెచ్సీలో 2021 నుంచి స్రవంతి అనే ఔట్సోర్సింగ్ఎంప్లాయ్పనిచేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో జనగామ డీఎంహెచ్ఓ ప్రశాంత్ఆమెను తొలగించారు. దీంతో స్రవంతి డీఎంహెచ్ఓను కలిసి తనను తీసేయొద్దని కోరింది. రెగ్యులర్ఫార్మసిస్ట్వచ్చినందునే, ఆమెను తొలగించినట్లు అధికారులు చెప్పి పంపించారు. అదే రోజున సాయంత్రం డీఎంహెచ్ఓ ఆఫీస్నుంచి జూనియర్ అసిస్టెంట్ అజార్ స్రవంతికి ఫోన్‌చేశాడు. ‘డీఎంహెచ్ఓ సార్మిమ్మల్ని ఆఫీసుకు రమ్మంటున్నారు’ అని చెప్పాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్రవంతితో ‘రూ.లక్ష లంచం ఇస్తే.. సార్నీ ఉద్యోగాన్ని రెగ్యులర్చేస్తారు’ అని అజార్ చెప్పాడు.
దీంతో స్రవంతి డీఎంహెచ్ఓ ప్రశాంత్‌ను కలిసి అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడింది. ‘అజార్ చెప్పినట్లు చేస్తే నీ పని అయిపోతుంది’ అని డీహెచ్ఓ చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. తర్వాత మూడు నెలలపాటు డీఎంహెచ్ఓ ఆఫీసు చుట్టూ తిరిగింది. చివరికి వారం కింద జూనియర్ అసిస్టెంట్ అజార్‌ను కలిసి స్రవంతి రూ.50 వేలు ఇచ్చింది. అయినా పోస్టింగ్ ఆర్డర్లు రాకపోవడంతో మరో రూ.50 వేలు ఇస్తానని చెప్పి, ఏసీబీని ఆశ్రయించింది. గురువారం అజార్‌కు రూ.50వేలు ఇచ్చింది. తర్వాత డీఎంహెచ్ఓ ప్రశాంత్‌ను కలిసి విషయం చెప్పింది. జాబ్‌తోపాటు ఏరియర్స్ఇప్పిస్తానని చెబుతుండగా, ఏసీబీ ఆఫీసర్లు రైడ్చేసి పట్టుకున్నారు. నిందితులిద్దరినీ నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ వెంట సీఐలు శ్యామ్, శ్రీనివాస్, రవి ఉన్నారు. నెలన్నర కింద లంచం తీసుకొంటూ జనగామ మున్సిపల్కమిషనర్రజిత ఏసీబీకి చిక్కగా, తాజాగా డీఎంహెచ్ఓ పట్టుబడడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.