కమ్మర్‌పల్లి, వెలుగు: ప్రజా సమస్యల పరిష్కారమే ధేయ్యంగా నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఇనాయత్ నగర్‌కు చెందిన బీజేపీ రాష్ట్ర నేత డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డి చేపట్టిన ‘జనంతోనే మనం’ పాదయాత్ర మంగళవారం ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు గడపగడపకు బీజేపీని తీసుకెళ్లడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. తొలి రోజు యాత్రను ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రారంభించి మాట్లాడారు. తొమ్మిది ఏళ్ల టీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రానికి ఒరిగింది ఏమీలేదన్నారు. కేసీఆర్‌కు పీఎంను ఎదుర్కొనే సత్తా లేకనే మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా తప్పించుకుని తిరుగుతున్నాడని దుయ్యబట్టారు. మల్లికార్జున్‌రెడ్డి బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో యాత్ర నిర్వహించి సమస్యలు తెలుసుకుంటామన్నారు. వాటిని పార్టీ అధ్యయన కమిటీ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి అమాయక ప్రజలపై కేసులు పెడుతూ బెదిరించి టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నాడని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌కు జైకొట్టిన వారికే పెన్షన్లు, సీఎం రిలీఫ్ పండ్ ఇప్పిస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి నర్సింహారెడ్డి,జిల్లా ఉపాధ్యాక్షుడు నిమ్మల శ్రీనివాస్, కమ్మర్‌పల్లి మండల ప్రెసిడెంట్ కట్ట సంజీవ్, బాల్కొండా, భీంమ్‌గల్, మోర్తాడ్, ఎర్గట్ల, ముప్కాల్, మెండోరా, వేల్పూర్ మండల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీఐటీయూ మండల కమిటీల ఎన్నిక
వర్ని, వెలుగు: మండల కేంద్రంలోని సీఐటీయూ ఆఫీస్‌లో మంగళవారం వర్ని, రుద్రూర్ మండల కమిటీలను ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు రమేశ్‌బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలో వర్ని మండల కన్వీనర్ గా మంగాదేవి, కోకన్వీనర్‌గా సాయిలు, రుద్రూర్ మండల కన్వీనర్‌గా రఫీక్, కోకన్వీనర్‌గా పద్మ తో పాటు 11 మంది కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. కొత్త కమిటీ నాయకులు, సభ్యులకు జిల్లా నాయకుడు నన్నేసాబ్ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కుల కోసం సీఐటీయూ నిరంతరం పోరాటాలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీదేవి, అనసూయ, రాజు, సాయిలు, లావణ్య పాల్గొన్నారు.
ఆర్మూర్‌లో యువ సమ్మేళనం
ఆర్మూర్, వెలుగు: నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఆర్మూర్‌లో యువ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అఖిల భారత సామాజిక సమరతా సంయోజకులు శ్యాంప్రసాద్ మాట్లాడుతూ మహనీయుల బలిదానాల ఫలితంగానే స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా రక్తదానం శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలకు చెందిన ప్రతినిధులు డాక్టర్ బసంత్ రెడ్డి, చరణ్ రెడ్డి, నారాయణ, అల్జాపూర్ దేవేందర్, పుప్పాల రాజేందర్, రాజులదేవి రవినాథ్, గంగారెడ్డి, దయాసాగర్ పాల్గొన్నారు.
జనాభాకు అనుగుణంగా ఓటర్ల నమోదు ఉండాలి: స్టేట్ అబ్జర్వర్ యోగితా రాణా
కామారెడ్డి, వెలుగు: జనాభాకు అనుగుణంగా ఓటర్ల నమోదు ఉండాలని ఎలక్ట్రోరల్ స్టేట్ అబ్జర్వర్ యోగితా రాణా సూచించారు. 18 ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో నిర్వహిస్తున్న ఓటర్ల నమోదు పక్రియను ఆమె పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్‌లెవల్ ఆఫీసర్లతో వేర్వేరుగా సమావేశమై మాట్లాడారు. బూత్‌లెవల్ ఆఫీసర్లు ప్రతి ఇంటిని విజిట్ చేయాలని, ఓటు లేని వారిని చేర్చడం, చనిపోయిన వారిని తొలగించడం చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలను కూడా మార్పుతో పాటు జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాలన్నారు. ఆధార్ అనుసంధానం కూడా జరగాలన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవోలు శ్రీనివాస్‌రెడ్డి, శీను, రాజాగౌడ్, ఎలక్షన్ సూపరింటెండెంట్ సాయి భూజంగ్‌రావు పాల్గొన్నారు.
సీఐటీయూ మహాసభల పోస్టర్ రిలీజ్
బాన్సువాడ, వెలుగు: ఈ నెల 18, 19వ తేదీలో హనుమకొండలో నిర్వహించే సీఐటీయూ 4వ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్‌ను మంగళవారం మండల కేంద్రంలో విడుదల చేశారు. ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో నిర్వహించిన ఈ ప్రోగ్రామ్‌లో ఆ సంఘం జిల్లా నాయకుడు ఖలీల్ మాట్లాడుతూ మహాసభలకు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కార్మికులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలునిచ్చారు. ప్రతి కార్మికుడికి దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రభుత్వం తీసిన ప్రతి పథకం ముందుగా మున్సిపాలిటీ వర్కర్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ సంఘం అధ్యక్షుడు పిట్లం సాయిలు, బుజ్జిగారి సాయిలు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
జడ్పీ మీటింగ్ వాయిదా
వరుసగా ఐదు సార్లు హాజరుకాని ఎమ్మెల్యేలు
నిజామాబాద్, వెలుగు: జడ్పీ జనరల్ బాడీ మీటింగ్‌లకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వరుసగా డుమ్మా కొట్టడం జిల్లాలో ప్రధాన చర్చగా మారింది. జిల్లాకు చెందిన మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తరుచూ జడ్పీ మీటింగ్‌లకు రావడం లేదు. మంగళవారం జరిగిన మీటింగ్‌కు కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక ఆఫీసర్లు సైతం హాజరు కాలేదు. నామ్ కే వాస్తేగా.. జడ్పీ హాల్‌లో మంగళవారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్ నామ్ కే వాస్తేగా సాగింది. మొత్తం 29 మంది సభ్యుల్లో 15 మంది మీటింగ్‌కు వచ్చారు. కానీ కలెక్టర్ నారాయణరెడ్డితో పాటు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కవిత, వీజీ గౌడ్ గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు రాకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పాలని జడ్పీటీసీలు ప్రశ్నించారు. వారి ప్రతిపాదన మేరకు మీటింగ్ వాయిదా వేశారు. 2021 మే నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు జడ్పీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశాలకు మంత్రి, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు రాలేదు. ఈసారి ప్రజాప్రతినిధుల బాటలో ఆఫీసర్లు కూడా నడిచారు. దీంతో కొరం ఉన్నా సభ్యుల కోరిక మేరకు మీటింగ్ వాయిదా పడింది.
ప్రమోషన్ల పాలసీని ప్రకటించండి
నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏడు ఏళ్లుగా ఉపాధ్యాయుల ప్రమోషన్లు, నాలుగేండ్ల నుంచి బదిలీలు లేవని ఈ ప్రక్రియపై ప్రభుత్వం వెంటనే పాలసీని ప్రకటించాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కటకం రమేశ్ డిమాండ్ చేశారు. జిల్లాలోని పలు పాఠశాలలను మంగళవారం సందర్శించి టీచర్ల సమస్యలను తెలుసుకోవడంతో పాటు సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు గంగప్రసాద్ పాల్గొన్నారు.
పట్టుదలతో చదవాలి
డిచ్‌పల్లి, వెలుగు: పట్టుదలతో చదివితే భవిష్యత్ బంగారుమయం అవుతుందని సోషల్ వేల్ఫేర్ డెవలప్‌మెంట్ కమిషనర్ యోగితా రాణా అన్నారు. మంగళవారం డిచ్‌పల్లి మానవతా సదన్‌ను ఆమె సందర్శించి పిల్లలతో మాట్లాడారు. స్టూడెంట్స్ గ్రేడింగ్ గురించి తెలుసుకున్నారు. అంతకుముందు ఖిల్లా డిచ్‌పల్లిలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఆమె వెంట అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, ఆర్డీవో రవి, తహసీల్దార్ శ్రీనివాస్, జీపీ సెక్రటరీ వినయ్ తదితరులు ఉన్నారు.
రెండో రోజూ పెన్‌డౌన్
నిజామాబాద్ అర్బన్, వెలుగు: మున్సిపల్ ఈఈ హరికిశోర్‌పై దాడికి నిరసనగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు చేపట్టిన పెన్‌డౌన్ రెండో రోజూ కొనసాగింది. మంగళవారం ఎంప్లాయీస్ విధులను బహిష్కరించి ఆఫీస్ ఎదుట బైఠాయించారు. తమ రక్షణపై కలెక్టర్, అడిషనల్కలెక్టర్వచ్చి స్పష్టమైన హమీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు పెన్‌డౌన్ కొనసాగుతుందని తేల్చిచెప్పారు.
స్టూడెంట్లకు బహుమతుల పంపిణీ
పిట్లం, వెలుగు: చిల్డ్రన్స్డేను పురస్కరించుకుని నిర్వహించిన వ్యాసరచన పోటీలో గెలుపొందిన స్టూడెంట్లకు మంగళవారం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ బాన్సువాడ డిబిజన్ ప్రెసిడెంట్ మర్గల వేణుగోపాల్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టూడెంట్లలో రక్తదానం, ఇతర సేవా కార్యక్రమాలపై అవగాహన పెంచేందుకు వ్యాసరచన పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పిట్లం రెడ్‌క్రాస్ సోసైటీ ప్రెసిడెంట్ బుగుడాల నవీన్, వైస్ ప్రెసిడెంట్ బొడ్ల రాజు, హైస్కూల్ హెచ్‌ఎం గణేశ్‌రావు పాల్గొన్నారు.
ఫండ్స్ కోసం మంత్రులను కలిసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
బోధన్, వెలుగు: బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ మేరకు మంగళవారం వారు హైదరాబాద్‌లో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్‌ను కలసి వినతిపత్రాలు సమర్పించారు. బోధన్ 100 పడకల ఆస్పపత్రిని 250 పడకలకు పెంచి అత్యాధునిక వసతులు కల్పించాలని కోరారు. శక్కర్‌నగర్‌లో 200 పడల మెటర్నటీ చైల్డ్ కేర్ హాస్పిటల్‌ను, 14, 34వ వార్డుల్లో బస్తీ దవాఖానలు, సాలూర మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రిని మంజూరు చేయాలని కోరారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రెబెల్లి దయాకర్‌కు రూ.100 కోట్ల ప్రతిపాదనలు అందజేశారు. సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ఈశ్వర్‌ను మైనార్టీ గ్రేవ్ యార్డులు, చర్చిలకు కాపౌండ్వాల్స్ నిర్మాణం కోసం రూ.10 కోట్లు మంజూరు చేయాలని కోరారు. గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు తండాల అభివృద్ధి కోసం రూ.25 కోట్లు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. వారి వెంట నియోజకవర్గానికి చెందిన లీడర్లు, డీసీబీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, బోధన్, నవీపేట్ మండల అధ్యక్షులు నర్సయ్య, నర్సింగ్‌రావు, మాజీ మండల రైతు బంధు కోఆర్డినేటర్బుద్దె రాజేశ్వర్ ఉన్నారు.
రెండో రోజూ పెన్‌డౌన్
నిజామాబాద్ అర్బన్, వెలుగు: మున్సిపల్ ఈఈ హరికిశోర్‌పై దాడికి నిరసనగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు చేపట్టిన పెన్‌డౌన్ రెండో రోజూ కొనసాగింది. మంగళవారం ఎంప్లాయీస్ విధులను బహిష్కరించి ఆఫీస్ ఎదుట బైఠాయించారు. తమ రక్షణపై కలెక్టర్, అడిషనల్కలెక్టర్వచ్చి స్పష్టమైన హమీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు పెన్‌డౌన్ కొనసాగుతుందని తేల్చిచెప్పారు.
విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలి
కామారెడ్డి, వెలుగు: విద్యార్థులు క్రమ శిక్షణతో మెలగాలని కామారెడ్డి ఎస్పీ బి.శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా రెండో రోజు మంగళవారం జిల్లా గ్రంథాలయంలో స్టూడెంట్లకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ మన దేశ సంస్కృతిపై రచించిన బుక్స్ చదవాలన్నారు. జిల్లా లైబ్రరీ చైర్మన్ ఉన్న రాజేశ్వర్, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ సత్యం పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచాలి: స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
వర్ని, వెలుగు: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జాకోరా, చందూరు మండలంలో చేపట్టే ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సంబంధిత ఆఫీసర్లకు సూచించారు. మంగళవారం పంప్ హౌజ్ నిర్మాణ భూమి పూజ చేసి అనంతరం ఇరిగేషన్ ఆఫీసర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. పనుల జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.106 కోట్లతో చేపట్టే ఎత్తిపోతల ప్రాజెక్ట్‌తో పది వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అనంతరం రుద్రూర్ మండల కేంద్రంలోని చెరువులో స్పీకర్ 4.13 లక్షల చేప పిల్లలను వదిలారు. కార్యక్రమంలో రుద్రూర్ ఎంపీపీ అక్కపల్లి సుజాత, జడ్పీటీసీ నరోజి గంగారాం, టీఆర్‌ఎస్ లీడర్లు పత్తి లక్ష్మణ్, పత్తి రాము, సోషల్ మీడియా కోఆర్డినేటర్ లాల్ మహ్మద్ పాల్గొన్నారు.
మహాజన సభను సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్ రూరల్, వెలుగు: సహకార సంఘా ల్లో నిర్వహించే మహాజన సభలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సహకార శాఖ అధికారి సింహాచలం సూచించారు. మంగళవారం నిజామాబాద్ మండలం మాధవ నగర్ సొసైటీలో సహకార వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించే మహాజన సభల్లో ఆయా సొసైటీలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పాలనాపరమైన అంశాలపై సవివరంగా చర్చలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సహకార వారోత్సవాల పతాకాన్ని ఆవిష్కరించారు. చైర్మన్ నాగేశ్వర్‌రావు, కార్పొరేటర్ ప్రమోద్, కార్యదర్శి వంశీ పాల్గొన్నారు.
నిధుల గోల్‌మాల్‌పై విచారణ
నిజామాబాద్ మండలం మాధవ నగర్ సహకార సంఘంలో జరిగిన నిధుల గోల్ మాల్అంశంపై పోలీసులు విచారణ జరిపారు. ఈ సొసైటీలో ప్రత్యేక అధికారుల పాలన సాగిన సమయంలో దాదాపు రూ.20 లక్షల నిధులు గోల్మాల్జరిగిందని పాలకండలి ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సొసైటీకి వచ్చిన ఎస్సై లింబాద్రి సంబంధిత దస్త్రాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు సేకరించానని, ఈ అంశంపై పూర్తి వివరాలు సేకరించి చర్యలు తీసుకుంటానని ఎస్సై తెలిపారు.
సమస్యల పరిష్కారం కోసం నిరసన
కామారెడ్డి, వెలుగు: కేజీబీవీ, యూఆర్ఎస్(అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్)లో పని చేస్తున్న టీచర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళారం టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మాచారెడ్డి మండలం ఆరేపల్లిలోని కేజీబీవీ, టౌన్‌లోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఎదుట నిరసన తెలిపారు. టీపీటీఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ సి.హెచ్ అనిల్‌కుమార్ మాట్లాడుతూ టీచర్ల కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ ఎంప్లాయీస్‌గా గుర్తించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. మండల జనరల్ సెక్రటరీ నాంపల్లి, ప్రతినిధులు కళ, శోభరాణి, గీతా, జ్యోతి, కళావతి, శైలజ, గౌతమి, గంగా పాల్గొన్నారు.