అధికారంలోకి రాగానే 24 గంటల కరెంటు ఇస్తాం : జానారెడ్డి 

నల్లగొండ జిల్లా : తెలంగాణ రాష్ట్రంలో 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 75 వేల కోట్ల అప్పు చేస్తే తొమ్మిదేళ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 5 లక్షల 60వేల కోట్ల అప్పు చేసిందని చెప్పారు మాజీ మంత్రి జానారెడ్డి. దేశంలో తొమ్మిదేళ్లలో రూ.112 లక్షల కోట్ల ఖర్చు ప్రధాని మోదీ చేశారని అన్నారు. మోదీ, కేసీఆర్ లు చేసిన అవినీతిపై ఒకరిపై మరొకరు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. రైతుబంధు పేరిట రైతులకు డబ్బులు ఇస్తూ.. లిక్కర్ పై పెంచిన ధరలతో ఒక్కో కుటుంబం నుండే రూ.40వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. హాలియాలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి మాట్లాడారు. 

గత ఎన్నికల్లో మద్యం, డబ్బు లేకుండా పోటీ చేయాలని సవాల్ చేసినా స్వీకరించలేదన్నారు జానారెడ్డి. ఉప ఎన్నికలో తనను ఓడించడానికి శత విధాల ప్రయత్నం చేసినా బీఆర్​ఎస్ అభ్యర్థి దగ్గర ఫలితం సాధించారని చెప్పారు. ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం తన వారసులను తయారు చేస్తున్నానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను పార్లమెంట్ బరిలో ఉంటానన్నారు. ఉచిత కరెంటు మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీయే అని, 24 గంటల కరెంటు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు అండగా తామంతా ఉంటామని భరోసా ఇచ్చారు.