
‘విశాఖ గర్జన’ సభలో పాల్గొన్న ఏపీ మంత్రులు విశాఖ ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన టైంలో వారి వాహనాల పై ఎటాక్ జరిగింది. సాయంత్రం టైంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఎయిర్ పోర్ట్ కు రావడం, ఆ ర్యాలీలో పాల్గొనేందుకు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఎయిర్ పోర్ట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మంత్రులు రోజా, జోగి రమేశ్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడి జరిగింది. తమపై కర్రలు, రాళ్లతో ఎటాక్ చేశారని మంత్రులు ఆరోపించారు. మంత్రి రోజా సహాయకుడికి గాయాలయ్యాయి. ప్రజాస్వామ్యంలో ఇది మంచిపద్ధతి కాదని మంత్రి జోగి రమేశ్ అన్నారు. గర్జనను పక్కదారి పట్టించేందుకే తాగుబోతులతో తమపై దాడి చేయించారని ఫైర్ అయ్యారు. తమతో పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో తిరగలేరని హెచ్చరించారు.
విశాఖలోని ఎల్ ఐసీ బిల్డింగ్ దగ్గరున్న అంబేడ్కర్ సర్కిల్ నుంచి బీచ్ రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహం వరకు ర్యాలీ జరిగింది. విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో ఏర్పాటైన జేఏసీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన సభ జరిగింది. ఈ సభలో ప్రజా ప్రతినిధులు, మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, న్యాయవాదులు, ప్రజా సంఘాలు, యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రజల అభివృద్ధి కోసం న్యాయంగా చేస్తున్న మా పోరాటానికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకాలని జేఏసీ నేతలు కోరారు.