జనసేన అభ్యర్థి, కేంద్ర మంత్రికి నిరసన సెగ

  • కోదాడలో తెలియని వ్యక్తికి  టికెట్​ ఎలా ఇస్తారని నిలదీత

కోదాడ, వెలుగు: సూర్యాపేట జిల్లా కోదాడలో జనసేన అభ్యర్థి ఎంపిక  కేంద్ర మంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ ఘెరావ్ కు దారి తీసింది. కోదాడ జనసేన, బీజేపీ బలపరిచిన సతీశ్​రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులను కాదని ఎన్నారైకి టికెట్ ఎలా ఇస్తారని మండిపడ్డారు. కనీసం కార్యకర్తలను కూడా పిలవకుండా నామినేషన్ వేయడంపై అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం బీజేపీ, జనసేనల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న మేకల సతీశ్​రెడ్డితో కలిసి కేంద్రమంత్రి రాజీవ్ చంద్ర శేఖర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

తర్వాత వెళ్లిపోతుండగా పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు అక్కడకు చేరుకొని అడ్డుకున్నారు. కోదాడకు పరిచయం లేని వ్యక్తిని జనసేన అభ్యర్థిగా ప్రకటించడంతో పాటు సమాచారం ఇవ్వకుండా నామినేషన్ ఎలా వేస్తారంటూ ఫైర్​ అయ్యారు. వెంటనే అభ్యర్థిని మార్చాలని, లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో బీజేపీ నాయకులు వారికి సర్ది చెప్పారు. కేంద్ర మంత్రి వెళ్లిన తర్వాత జనసేన కార్యకర్తలు  సతీశ్​రెడ్డి ఎదుట నిరసన తెలిపారు.