న్యూఢిల్లీ, వెలుగు : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌తో కలిసి పవన్ బీజేపీ నేషనల్ లీడర్లతో భేటీ అవుతున్నారు. ఏపీ బీజేపీ ఇన్చార్జ్ మురళీధరన్‌తో పవన్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గంటన్నరపాటు సాగిన ఈ భేటీలో ఏపీ తాజా రాజకీయ పరిస్థితులు, ప్రచార వ్యూహాలు, బీజేపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది.
మురళీధరన్‌తో భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. ‘ఇంకా పలువురిని కలవాల్సి ఉంది. మరిన్ని మీటింగ్స్ ఉన్నాయి. అందరినీ కలిసిన తర్వాత వివరంగా మాట్లాడతా’అని చెప్పారు. ఇక కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌ను కలిసి పోలవరం ప్రాజెక్టును సత్వరం పూర్తి చేయాలని పవన్ కోరారు. ఢిల్లీ పర్యటనలో పవన్.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలిసే అవకాశం ఉన్నట్లు జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి.