వైసీపీని ఓడించడమే జనసేన, బీజేపీ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. దాదాపు అరగంటపాటు సమావేశమయ్యారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలనేదే జనసేన, బీజేపీ అజెండా అని వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి ఏపీకి విముక్తి కలగాలన్నారు. రెండు రోజుల పాటు బీజేపీ నేతలతో జరిగిన సమావేశాలు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇస్తాయన్నారు.
వైసీపీని ఎలా ఓడించాలనేదానిపైనే భేటీలో చర్చించామని పవన్ చెప్పారు. రాబోయే రోజుల్లో అన్నీ విషయాలు చెబుతానన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే తమ అభిప్రాయమని వెల్లడించారు. అధికారం సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని పవన్ చెప్పారు. పొత్తులపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు.
ఏప్రిల్ 3న బీజేపీ ఏపీ ఇంఛార్జ్ మురళీధరన్ తో భేటీ అయిన పవన్ కళ్యాణ్..ఇవాళ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పవన్ కేంద్రమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని ప్రచారం జరిగింది.