2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో జత కట్టి పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2ఎంపీ స్థానాల్లో విజయం సాధించి దేశం మొత్తాన్ని తనవైపు చూసేలా చేసింది జనసేన.కూటమి ఏర్పడటంలో కీలకపాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రధాని మోడీ కూడా ప్రశంసలు కురిపించాడు.గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమై ఘోర పరాభవాన్ని మూట కట్టుకున్న జనసేన ఇప్పుడు 21సీట్లతో గర్వంగా అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన శాసనసభాపక్షం సమావేశం అయ్యింది.
ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది జనసేన. శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ పేరును నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించగా జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా బలపరిచారు. ఈ నెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంలో జనసేనకు 3నుండి 4మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు మరో కీలక శాఖను కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.