టీడీపీ అవినీతి తాట తీసింది జనసేనే

విశాఖపట్నం , వెలుగు: టీడీపీ అవినీతి తాటతీసింది జనసేన పార్టీయేనని ఆ పార్టీ అధ్యక్షుడు  పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు  వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిచ్చిపిచ్చిమాటలు మానుకోవాలని  హెచ్చరించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాకు జగన్ సన్నిహితుడని,అందుకే కేంద్రం సహకారం తీసుకుంటున్నారని ఆరోపించారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో తాను పోటీ చేస్తున్న గాజువాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. “జనసేన అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుం ది. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చా. వైజాగ్ కి కొత్వాల్ గా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ బరిలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టో సిద్ధం చేశాం . ప్రభుత్వ ఉద్యోగులకు సీపీస్ రద్దు చేసి పాత పింఛన్ అమలు చేస్తాం. పన్నుల భారం తగ్గిస్తాం . ఐదేళ్లలో 50 లక్షల మొక్కలు నాటిస్తా.  చిరు వ్యాపారులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం ” అని అన్నారు. గాజువాక ప్రాంతాన్ని మోడర్న్ మినీ సిటీగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 64 అంశాలతో గాజువాకకు మేనిఫెస్టో  విడుదల చేశారు.