నేను చావాలని కొంతమంది కోరుకుంటున్నారు: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

నేను చావాలని కొంతమంది కోరుకుంటున్నారు: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోవాలని కొంతమంది కోరుకుంటున్నారని అన్నారు. తాను చనిపోతే బాగుండని.. తనతో ఉన్నవాళ్లే కోరుకుంటున్నారని అన్నారు బొలిశెట్టి. ఉపఎన్నికలు వస్తే కొంతమంది ఎమ్మెల్యే కావాలని అనుకుంటున్నారని అన్నారు. తాను చనిపోయాక ఎమ్మెల్యే కావాలని అనుకుంటే పర్లేదు కానీ.. బతికుండగానే చనిపోవాలని కోరుకోవడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు బొలిశెట్టి. ఎవరి దయాదాక్షిణ్యాలతో తాను గెలవలేదని.. ప్రజామోదంతో నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందానని అన్నారు. బొలిశెట్టి వ్యాఖ్యలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశం అయ్యాయి.

ఒకరి త్యాగం వల్ల తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని.. మూడు పార్టీలు కలిసి తనకు అధికారాన్ని కట్టబెట్టాయని అన్నారు. నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తున్నానని.. కొంతమంది అధికారులను భయపెట్టి బెదిరిస్తున్నారని అన్నారు బొలిశెట్టి. అధికారులను కాపాడుకోవడం ఎమ్మెల్యేగా తన బాధ్యత అని అన్నారు. తాడేపల్లి నియోజకవర్గాన్ని మరో పిఠాపురం చేస్తామని కొంతమంది అంటున్నారని.. తానేమీ చేతికి గాజులు తొడుక్కొని కూర్చోలేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బొలిశెట్టి శ్రీనివాస్.

తాను స్థలాలు, పొలాలు పూడ్చలేదని.. తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల కోసం పనిచేస్తున్నానని చెప్పారు. ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా తాను ఇబ్బంది పెట్టడం లేదని అన్నారు. ఎమ్మెల్యేగా తనకు గౌరవం ఇవ్వాలని కోరారు బొలిశెట్టి శ్రీనివాస్. బొలిశెట్టి వ్యాఖ్యలతో కూటమి నాయకుల మధ్య విభేదాలు, సమన్వయ లోపం మరోసారి బయటపడ్డాయి. బొలిశెట్టి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.