
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణఖేడ్ కు వచ్చిన సీఎం కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప ఆరోపించారు. మంగళవారం పట్టణంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ.. మూడున్నర ఏళ్ల కిందట బసవేశ్వర, సంగమేశ్వర ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్ ఇప్పటిదాకా ఒక తట్ట మట్టి కూడా ఎందుకు ఎత్తలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
మామ ఒకసారి, అల్లుడు హరీశ్ రావు మరోసారి ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారని, ఇప్పటిదాకా ఇంచు పని కూడా జరగలేదని మండిపడ్డారు. పైగా కాళేశ్వరం నీళ్లు తెచ్చి నారాయణఖేడ్ కు సాగునీరు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వైపు కుంగిపోతుంటే ఇంకా ఆ ప్రాజెక్టు పేరు చెప్పి మోసం చేయాలని ప్రయత్నం చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని నల్లవాగు ప్రాజెక్టుపై ఇప్పుడు లిఫ్ట్ పెడతా అని చెబుతున్న కేసీఆర్ ఈ పదేళ్లలో ఎందుకు చేయలేదని నిలదీశారు. ఇప్పటికే మంజీరాపై ఉన్న నాలుగు లిఫ్టులను కేవలం రూ. 5 కోట్లు పెట్టి రిపేర్ చేస్తే వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఎందుకు వాటిపై పైసా కూడా ఖర్చు చేయలేదని ప్రశ్నించారు.
తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం తప్ప ఒక్క పైసా నిధులు ఇవ్వలేదని, ఒక్క తండాలో కూడా గ్రామపంచాయతీ భవనం లేదని ఆగ్రహించారు. నారాయణఖేడ్ నియోజకవర్గం లో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంటే చాలా గొప్పగా ఉన్నాయని చెప్పుకోవడానికి సిగ్గుండాలన్నారు. గిరిజన బిడ్డలు ఇప్పుడు చైతన్యవంతమయ్యారని కేసీఆర్ మాయమాటలకు మోసం పోవడానికి సిద్ధంగా లేరన్నారు. ఖేడ్ లో 75 ఏళ్ల పాతరాజకీయ శకం ముగిసిందని కొత్త శకం ప్రారంభమైందని, బీజేపీ గెలుపు పక్కా అని తెలిపారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాయిరాం, యువమోర్చా నాయకుడు పట్నం మాణిక్, సతీశ్, సుగుణాకర్, సాయి పటేల్, నమలిమెట్ శివ, జైపాల్, లోకేష్ ఉన్నారు.