
ఇస్లామాబాద్: పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల విషయంలో దాయాది పాక్ దేశ అసలు రంగు బయటపడింది. బయటకు మాత్రం పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్‌తో మాకు సంబంధం లేదని సుద్దాపూస మాటలు మాట్లాడి.. దాడిని ఖండించింది. కానీ పాక్ ఉప ప్రధాని వ్యాఖ్యలతో వారి నిజస్వరూపం బట్టబయలైంది. 28 మంది అమాయక ప్రజలను అత్యంత కిరాతకంగా ఊచకోత కోసిన నరరూప రాక్షసులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చాడు పాక్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్. ఈయన వ్యాఖ్యలతో పాక్ వక్రబుద్ధి ప్రపంచదేశాల ముందు మరోసారి తేటతెల్లమైంది.
పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్ ఘటనపై ఇషాక్ దార్ ఇస్లామాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ జిల్లాలో దాడులు చేసిన వారు స్వాతంత్ర్య సమరయోధులు అని అభివర్ణించారు. భారత్ సింధూ నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడంపైన ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ‘‘పాకిస్తాన్‌లో 240 మిలియన్ల మందికి సింధు నది నీరు అవసరం. మీరు ఆ ఒప్పందాన్ని ఆపలేరు. ఒకవేళ ఇండస్ ట్రీటీ రద్దు చేస్తే అది యుద్ధ చర్యకు సమానం’’ అని వ్యాఖ్యానించారు.
భారతదేశం పాకిస్తాన్‌ను బెదిరించిన లేదా దాడి చేసినా.. ఆ దేశం కూడా అదే విధమైన ప్రతిచర్యను ఎదుర్కొంటుందని అన్నారు. 28 మందిని మానవత్వం లేకుండా మట్టుబెట్టిన ఉగ్రవాదులను పాక్ ప్రధాని ఏకంగా స్వాతంత్ర సమరయోధులతో పోల్చడంపై భారత ప్రజలు భగ్గుమంటున్నారు. ఇదే పాక్ అసలైన బుద్ధి అని విమర్శిస్తున్నారు. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది అనడానికి ఇదే నిదర్శనమని విమర్శలు గుప్పి్స్తున్నారు.
కాగా, జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ఏరియా బైసారన్ మైదాన ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 22) ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే పహల్గాంకు కుటుంబంతో కలిసి సరదాగా టైమ్ స్పెండ్ చేసేందుకు వచ్చిన పర్యాటకులపై ఉగ్రమూకలు విచక్షణరహితంగా కాల్పులు జరిపాయి. ముష్కరుల పాశవిక దాడిలో 26 మంది అమాయక ప్రజలు మృతి చెందగా.. మరికొందరు పర్యాటకులు బుల్లెట్ గాయాలకు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరుల కోసం భారత దళాలు జమ్మూ కాశ్మీర్‌ను అణువణువునా శోధిస్తున్నారు.