కాశ్మీర్​కు రాష్ట్ర హోదా!...సీఎం ఒమర్ అబ్దుల్లాకు కేంద్రం హామీ 

కాశ్మీర్​కు రాష్ట్ర హోదా!...సీఎం ఒమర్ అబ్దుల్లాకు కేంద్రం హామీ 
  • ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్ నాథ్, ఇతర మంత్రులతో సీఎం భేటీ 

న్యూఢిల్లీ:  జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసింది. ఈ మేరకు జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాకు హామీ ఇచ్చినట్టు సమాచారం. ఒమర్ అబ్దుల్లా ఇటీవల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆయన బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

‘‘దాదాపు అరగంట పాటు మీటింగ్ జరిగింది. జమ్మూకాశ్మీర్ లో కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని అమిత్ షా చెప్పారు. జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ప్రక్రియను ప్రారంభిస్తామని ఒమర్​ అబ్దుల్లాకు హామీ ఇచ్చారు” అని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే గురువారం ప్రధాని నరేంద్ర మోదీతోనూ ఒమర్ అబ్దుల్లా భేటీ అయ్యారు. జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరారు.

ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ప్రధాని మోదీకి అందజేశారు. కాగా, జమ్మూకాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత ఇటీవల జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. ఒమర్ అబ్దుల్లా సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కాశ్మీర్ కు తిరిగి రాష్ట్ర హోదా ఇవ్వాలని తొలి కేబినెట్ మీటింగ్ లోనే తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా ఆమోదం తెలిపారు.