జనగామ మున్సిపల్ ఛైర్ పర్సన్పై అవిశ్వాసం..!

జనగామ మున్సిపల్  ఛైర్ పర్సన్పై అవిశ్వాసం..!

జనగామ మున్సిపాలిటిలో క్యాంపు రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లలో అసంతృప్తి బయటపడింది. ఛైర్ పర్సన్ పోకల జమునపై సొంత పార్టీ నేతలే అవిశ్వాసానికి రెడీ అయ్యారు. తమకు సరైన గౌరవం లేదని కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. తమ కాలనీల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని ఛైర్మన్ పై అసంతృప్తిగా ఉన్నారు.  ఈ క్రమంలోనే 19వ వార్డు కౌన్సిలర్ బండ పద్మతో కలిసి మిగితా కౌన్సిలర్లు క్యాంపునకు వెళ్లారు. 

కౌన్సిలర్లతో బండ పద్మ ఒక దేవాలయంలో ప్రమాణం చేయించుకున్న ఫోటోలు లీక్ అయ్యాయి. ఆమెకు ఇతర పార్టీల కౌన్సిలర్లు మద్దతు సైతం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో జనగామ జిల్లా రాజకీయాలు మరింత హీటెక్కాయి. బండ పద్మ ఇప్పటికీ రెండు సార్లు మున్సిపల్ చైర్మన్ సీటుని ఆశించి భంగపడ్డారు.  జనగామ మున్సిపా లిటీలో మొత్తం 30 వార్డులు ఉన్నాయి. బండ పద్మ క్యాంపులో 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారని సమాచారం.

మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం చైర్ పర్సన్ గా కొనసాగుతున్న సభ్యులపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలంటే కనీసం మూడేళ్లు పూర్తి చేసుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. గతేడాది మంత్రి కేటీఆర్ మూడేళ్ల పదవీ కాలాన్ని నాలుగేళ్లు పొడిగిస్తూ చట్టాన్ని సవరణ చేసి అసెంబ్లీలో ఆమోదించారు. ప్రస్తుతం మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు గవర్నర్ అమోదం తెలపకపోవడంతో అది పెండింగ్ లో ఉంది. జనగామ బల్దియా చైర్ పర్సన్ పదవీకాలం ఇవాళ్టితో మూడేళ్లు పూర్తి చేసుకుంటుంది. దీంతో అవిశ్వాసంపై రోజురోజుకు చర్చ తీవ్రమవుతోంది.