- బాధ్యులపై క్రిమినల్ కేసుల నమోదుకు రంగం సిద్ధం
జనగామ, వెలుగు: చాకలి ఐలమ్మ జనగామ జిల్లా మహిళా సమాఖ్య కుంభకోణం బాధ్యులను కటకటాల్లోకి పంపేందుకు రంగం సిద్ధమవుతోంది. అవినీతి సొమ్ము రికవరీలో జాప్యం పై కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ సీరియస్‌గా ఉన్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. అవినీతి సొమ్మును తిరిగి చెల్లించాలని ఇచ్చిన ఆదేశాలను బేఖాతర్చేయడంతో బాధ్యులపై నేడో రేపో క్రిమినల్కేసులు నమోదు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఐకేపీ కొనుగోలు సెంటర్ల ధాన్యం కొనుగోళ్ల మార్కెటింగ్ద్వారా వచ్చిన ఆదాయం జిల్లా మహిళా సమాఖ్య ఖాతాలో రూ.4 కోట్ల పై చిలుకు అందుబాటులో ఉంది.
దీనిపై కొందరు సెర్ప్అధికారులు, సిబ్బంది కన్నేశారు. జనగామ మండలంలోని వెంకిర్యాలలో రాళ్లు రప్పలతో హై టెన్షన్ వైర్ల కింద తక్కువ విలువ చేసే 4 ఎకరాల స్థలాన్ని అగ్గువకే కొనుగోలు చేసేందుకు ఓ రియల్టర్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఆగస్టులో అధిక ధరకు కొన్నట్లు వ్యవహారం నడపగా, కొందరు మహిళా సంఘాల సభ్యులు అవకతవకలు జరిగాయని కలెక్టర్‌కు అక్టోబర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్విచారణకు ఆదేశించగా, అవినీతి బయట పడింది.
రికవరీ వాయిదాలు..
వెంకిర్యాలలో మహిళా సమాఖ్య కొన్న ఏరియాలో ఎకరాకు రూ.40 లక్షల వరకు ధర పెట్టొచ్చని రెవెన్యూ అధికారులు కలెక్టర్‌కు నివేదించారు. మహిళా సమాఖ్య మాత్రం ఓ రియల్టర్ వద్ద ఎకరాకు రూ.58 లక్షల 75 వేల చొప్పున నాలుగెకరాలకు రూ.2.35 కోట్లుకు కొనుగోలు చేసింది. పేపర్‌పై లెక్కలు ఇలా ఉన్నా రియల్టర్‌కు ఎకరాకు రూ.40 లక్షల వరకు సదరు సమాఖ్య ప్రతినిధులు చెల్లించినట్లు ఆరోపణలున్నాయి. అంటే ఎకరాకు రూ.18 లక్షల 75 వేలు కమిషన్రూపంలో తీసుకున్నట్లు తేలడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మార్కెట్లో లేని విధంగా తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించాలని నెలన్నర క్రితమే రియల్టర్‌ను ఆదేశించారు. అంగీకరించిన సదరు రియల్టర్ అక్టోబర్‌లో రూ.30 లక్షలు తిరిగి చెల్లించాడు. మిగిలిన డబ్బులను ఇచ్చేందుకు గత నెల 20న వాయిదా ఉండగా, చెల్లించలేదు. ఈనెల 5న, సోమవారం కొంత చెల్లిస్తానని అన్నప్పటికీ అదీ జరుగలేదు. దీంతో రికవరీపై జాప్యం జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, జిల్లా మహిళా సమాఖ్య భూ కుంభకోణం వ్యవహారంలో
31 మందికి పైగా బాధ్యులుపై క్రిమినల్కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మహిళా సమాఖ్యల్లో ప్రతి మూన్నెళ్లకు ఒకసారి ఆడిట్లు చేసి చిన్న తప్పిదాలకు మెమోలు అందించే సదరు అధికారి జిల్లా సమాఖ్యలో జరిగిన రూ.2 కోట్ల పై చిలుకు లావాదేవీలను ఎందుకు పట్టించుకోలేదనే వాదనలున్నాయి.