జనగామ అర్బన్, వెలుగు: నులి పురుగుల నివారణకు అల్బెండజోల్మాత్రలు వేయాలని, ఈ నెల 20న మొదటిదశ జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం జరుగనున్నట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ సేవలను మరింతగా పెంచాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం, తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్బెండజోల్ మాత్ర నులి పురుగుల సంక్రమణను నియంత్రించుటలో సహాయపడుతుందని, జిల్లాలోని అన్ని కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలందరికీ ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జాతీయ నులి పురుగుల నిర్మూలన పోస్టర్‌ను సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో హరీశ్‌రాజ్, మున్సిపల్ కమిషనర్వెంకటేశ్వర్లు, డీఈవో కె.రాము, డీఐఈవో ఆంజనేయరాజు, డీడబ్ల్యూవో జయంతి, డీఐవో మహేందర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధీర్, ప్రోగ్రాం అధికారులు, డీఈఎంవో ప్రభాకర్, సీహెచ్‌వో జైపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.