
- తహసీల్దార్ వద్ద పరిష్కారం కాకపోతే.. ఆర్డీవో, కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చు
బచ్చన్నపేట, వెలుగు: భూ భారతి చట్టం రైతుల భూములకు రక్షణ కవచం లాంటిదని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. గురువారం బచ్చన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుకు హాజరై రైతులకు పలు అంశాలు వివరించారు. భూ భారతి ద్వారా రైతుల భూములు సర్వే చేయించి హద్దులు నిర్ణయించి మ్యాపులతో సహా రిజిస్ర్టేషన్ సమయంలో ఇస్తారన్నారు. దీని వల్ల భూములు కబ్జా చేయడానికి అవకాశం ఉండదన్నారు.
రైతులు తమ భూములను ఆన్లైన్లో చూసుకునే అవకాశం ఉంటుందన్నారు. గతంలో ఏవైనా భూ సమస్యలు వస్తే కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని భూ భారతితో 90శాతం తహసీల్దార్ వద్దే పరిష్కారం అవుతాయని తెలిపారు. లేదంటే ఆర్డీవో, కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చన్నారు. భూ భారతి ద్వారా రైతులకు చేకూరే ప్రయోజనాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో అవగాహన కల్పించారు. రైతులు అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానం చెప్పారు.
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
-భూ భారతి సదస్సు అనంతరం మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. కేంద్ర నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. తేమ శాతం రాగానే ధాన్యం తూకం వేసి ట్యాగ్ చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. రికార్డులను పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయన వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, ఆర్డీవో గోపిరాం, డీఏవో రామారావు నాయక్, తహశీల్దార్ ప్రకాశ్ రావు, ఇతర ఆఫీసర్లు, రైతులు, రైతు సంఘాల నాయకులు, కేంద్ర నిర్వాహకులు పాల్గొన్నారు.
భూభారతితో సమస్యలకు శాశ్వత పరిష్కారం
మొగుళ్లపల్లి, వెలుగు: భూభారతి ఆర్ఓఆర్ చట్టం 2025 అన్నదాతలకు ఒక వరమని దీంతో భూ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం లభిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌తో అప్పటి పాలకులు రైతులను నిండా ముంచి మోసం చేశారని ఫైరయ్యారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో, టేకుమట్ల మండలం ఆసిరెడ్డిపల్లి గ్రామ శివారులోని అమ్మ గార్డెన్ ఫంక్షన్ హాల్లో రైతులకు భూభారతి చట్టంపై అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో పాటు ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
రైతులకు ఉన్న అభద్రతభావానికి తావు లేకుండా జవాబుదారుతనం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. ఈ కొత్త చట్టంతో లావాదేవీలు, మ్యూటేషన్, ఆర్ఓఆర్, రిజిస్ట్రేషన్లు, మార్పులు చేర్పులు, సాదా బైనమా వంటి సేవలు సులభతరం అవుతాయన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీవో రవి, చిట్యాల ఏఎంసీ చైర్మన్ శ్రీదేవి, వైస్ చైర్మన్ రఫీ, పీఏసీఎస్ చైర్మన్ నర్సింగ రావు, తహసీల్దార్లు సునీత, విజయలక్ష్మి, మండలాల స్పెషల్ ఆఫీసర్లు, అగ్రికల్చర్ ఆఫీసర్లు పాల్గొన్నారు.