- ఏసీబీ వలలో జనగామ మున్సిపల్ కమిషనర్
- ‘మార్టిగేజ్’ రిలీజ్ కోసం రూ. 40 వేలు డిమాండ్ చేసిన రజిత
- కారు డ్రైవర్‌కు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఆఫీసర్లు
జనగామ అర్బన్, వెలుగు : జనగామ మున్సిపల్కమిషనర్ జె. రజిత 40 వేల రూపాయలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకీ చిక్కారు. ఈ కేసులో మున్సిపల్ కమీషనర్‌తో పాటు ఆమె కారు డ్రైవర్ నవీన్ ను కూడా ఏసీబీ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఏసీబీ డీఎస్పీ సాంబయ్య వెల్లడించిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని బండ్లగూడెం గ్రామానికి చెందిన చెట్టిపల్లి రాజు జనగామలో బిల్డింగ్ రూల్స్ప్రకారం ఓ భవనం నిర్మించడం కోసం మున్సిపల్ఆఫీస్ పేరుమీద 10 శాతం స్థలాన్ని మార్టిగేజ్ చేశాడు.
నిర్మాణం పూర్తయిన తర్వాత బిల్డింగ్ మార్టిగేజ్ రిలీజ్ కోసం, తర్వాత రాజు పేరుపై మార్చడానికి కమీషనర్ రజిత రూ. 40 వేలు లంచం డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు తాను లంచం ఇచ్చుకోలేనని చెప్పినా వినిపంచుకోలేదు. దీంతో ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచనల ప్రకారం...సోమవారం రూ.40 వేలు తీసుకొని మున్సిపల్ఆఫీస్ కు వచ్చాడు. ఆ డబ్బులను తన డ్రైవర్ నవీన్ కు ఇవ్వాలని కమీషనర్ రజిత సూచించింది. దీంతో రాజు నవీన్చేతిలో డబ్బులు పెడుతుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రైవర్ నవీన్‌తో పాటు మున్సిపల్ కమీషనర్ రజితను విచారించారు. ఆమె లంచం అడిగింది నిజమేనని ఒప్పుకున్నారు. రజితతో పాటు డ్రైవర్‌ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్డులో హాజరుపరుచనున్నట్లు సాంబయ్య తెలిపారు. ఏసీబీ ఇన్స్పెక్టర్లు రవి, శ్రీనివాస్, శ్యాం పాల్గొన్నారు.