- తలాపునే నీళ్లున్నా... తాగేందుకు పనికొస్తలే
- చీటకోడూరు ఫిల్టర్ బెడ్ల నుంచి రంగుమారిన నీళ్ల సరఫరా
- తాగేందుకు వీలు లేకపోవడంతో ఇతర అవసరాలకు వినియోగం
- ఈ నీళ్లు ఉన్నాయన్న సాకుతో మిషన్ భగీరథ నీళ్ల నిలిపివేత
జనగామ, వెలుగు జనగామ జిల్లా కేంద్రంలోని ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. తలాపునే చీటకోడురు నీళ్లున్నా అవి తాగేందుకు పనికి రావడం లేదు. ఈ నీళ్లు ఉన్నాయన్న సాకుతో మిషన్ భగీరథ నీటి సరఫరాను నిలిపేశారు. దీంతో అటు భగీరథ నీరు రాక, ఇటు స్థానికంగా స్వచ్ఛమైన నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఫిల్టర్ బెడ్ల మెయింటెనెన్స్ పేరుతో ప్రతి నెల సుమారు రూ. 2 లక్షలు ఖర్చు చేస్తున్న మున్సిపల్ ఆఫీసర్లు శుద్ధమైన నీటిని అందించడంలో మాత్రం విఫలం అవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
రంగు మారిన నీళ్లు సరఫరా
జనగామ జిల్లా కేంద్రంగా మారిన తర్వాత వేగంగా అభివృద్ధి చెందుతోంది. పట్టణంలో నివాసం ఉండే ఫ్యామిలీలు సైతం పెరిగిపోతున్నాయి. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 13 వేల ఫ్యామిలీలు, లక్షకు పైగా జనాభా నివసిస్తోంది. పట్టణంలో ప్రైవేట్ నల్లాలు 12,500లకు పైగా ఉండగా పబ్లిక్ నల్లాలు 200ల వరకు ఉన్నాయి. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.20.28 కోట్లతో చీటకోడూరు రిజర్వాయర్ వద్ద ఫిల్టర్ బెడ్లను నిర్మించింది. వీటి ద్వారా రిజర్వాయర్‌లోని దేవాదుల నీటిని ఫిల్టర్ చేసి తాగునీటిగా మార్చి పట్టణ ప్రజలకు సరఫరా చేయాలి. కానీ ఆఫీసర్లు అంతగా పట్టించుకోకపోవడంతో రంగు మారిన నీళ్లు సరఫరా అవుతున్నాయి. దీంతో ప్రజలు ఈ నీటిని తాగేందుకు కాకుండా ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. ఏండ్ల తరబడి ఇదే సమస్య నెలకొన్నా పరిష్కరించేందుకు ఆఫీసర్లు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
జోరుగా ప్రైవేట్ నీటి దందా
చీటకోడూరు ఫిల్డర్ బెడ్ల పనితీరు నామమాత్రంగా మారడం, రంగు మారిన నీళ్లు సరఫరా అవుతుండడంతో పట్టణంలో ప్రైవేట్ నీళ్ల వ్యాపారం జోరుగా సా గుతోంది. కొందరు వ్యక్తులు కనీస రూల్స్ కూడా పాటించకుండా, ఆఫీసర్ల నుంచి అనుమతులు తీసుకోకుండా మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 200 వరకు వాటర్ ప్లాంట్లు నడుస్తున్నాయి. ఒక్కో ప్లాంట్ రోజుకు సుమారు రూ. 4 లక్షల బిజినెస్ చేస్తోంది. నీటిని తియ్యగా మార్చేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వాడుతున్నారు. వీటి కారణంగా నీటిలో ఉండాల్సిన కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటివి పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఇలాంటి నీటిని దీర్ఘకాలికంగా తాగితే ఎముకలు బలహీనంగా మారి కీళ్లనొప్పులు, ఇతర సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు స్పందించి చీటకోడూరు ఫిల్టర్ బెడ్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నిర్భయంగా తాగొచ్చు
చీటకోడూరు రిజర్వాయర్ వద్ద ఉన్న ఫిల్టర్ బెడ్లు సరిగానే పనిచేస్తున్నాయి. అప్పుడప్పుడు పైప్‌లైన్ సమస్యల కారణంగా మురుగు నీళ్లు వస్తుండవచ్చు. ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ నీటిని నిర్భయంగా తాగొచ్చు.
- పోకల జమున లింగయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్, జనగామ