జనగామ రైల్వే స్టేషన్ బ్యూటిఫికేషన్ స్లో

జనగామ రైల్వే స్టేషన్ బ్యూటిఫికేషన్ స్లో
  •     కాంట్రాక్టర్ల ఇష్టారీతిన సాగుతున్న పనులు
  •     నిధులున్నా.. పనుల పర్యవేక్షణ కరవు
  •     మూడు నెలలుగా తొలిదశలోనే బ్యూటిఫికేషన్​

జనగామ, వెలుగు : అమృత్ భారత్​పథకం కింద దేశ వ్యాప్తంగా ఎంపికైన రైల్వే స్టేషన్లలో జనగామ రైల్వే స్టేషన్ ఒకటి. దీన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రైల్వే శాఖ నిధులు విడుదల చేసినా పనులు స్లోగా సాగుతున్నాయి. పర్యవేక్షించేవారు లేకపోవడంతో బ్యూటిఫికేషన్​పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కనీసం కట్టిన గోడలకు క్యూరింగ్​కూడా చేయడం లేదు. సెంట్రల్​ గవర్నమెంట్ పనులు కావడంతో స్థానిక ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు లైట్ తీసుకుంటున్నారు.

స్టేషన్​ముందు చేపట్టిన గార్డెనింగ్​పనులు ఆగి.. ఆగి.. సాగుతున్నాయి. రైల్వే ప్రయాణికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. బ్యూటిఫికేషన్ పనులను భాగాలుగా విభజించి వేర్వేరు కాంట్రాక్టర్లకు అప్పగించడంతో ఏ పని ఎవరు చేస్తున్నారో తెలియడం లేదు. వచ్చి, పోయే ప్రయాణికులకు స్లోగా సాగుతున్న పనులతో ఇబ్బందిగా ఉంటోంది.

పట్టింపేది?

జనగామ రైల్వే స్టేషన్​నుంచి డెయిలీ 3,760 మంది ప్రయాణికులు జర్నీ చేస్తున్నారు. ఈ స్టేషన్​నుంచి సుమారు రూ.3.57 కోట్ల వార్షిక ఆదాయం ఉంటుందని రైల్వే శాఖ అంచనా. ఈ క్రమంలోనే కేంద్రం అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. తొలుత రైల్వే స్టేషన్ మొదటి ప్లాట్​ఫాంను అభివృద్ధి, స్టేషన్ ఇవతల,​ అవతల ప్రాంతాలను కలుపుతూ అమ్మబావి సమీపంలో ఫుట్​ఓవర్​బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఇప్పుడున్న బుకింగ్ కౌంటర్​స్థానంలో కొత్తగా కట్టాల్సి ఉంది.రైల్వే పోలీస్​స్టేషన్ ముందు భాగం, స్టేషన్​మేనేజర్​ఆఫీసును తిరిగి నిర్మించాల్సి ఉంది.

వెయిటింగ్ హాల్, మోడరన్ టాయిలెట్స్, చైర్స్, స్టేషన్ బయట గార్డెనింగ్​పనులు చేయాల్సి ఉంది. అయితే ముందు మొదలుపెట్టిన గార్డెనింగ్​పనులు స్లోగా జరుగుతున్నాయి. బీటీ లేయర్​ను తొలగించిన కాంట్రాక్టర్లు తర్వాత పనులు ఆపారు. ఇటీవల తిరిగి ప్రారంభించారు. కానీ పనుల్లో క్వాలిటీ ఉండడం లేదు. గార్డెనింగ్​వాల్స్ నాసిరకంగా కడుతున్నారు. ప్లాట్​ఫాం 1, 2లోకవర్​షెడ్ల పనులు నెమ్మదిగా  జరుగుతున్నాయి. ఫుట్​ఓవర్ ​బ్రిడ్జి పనులు మొదటి దశ దాటలేదు.

పూర్తికాక ముందే కూలుతున్నయ్..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 50 రైల్వే స్టేషన్లను అమృత్​భారత్ పథకం కింద ఎంపిక చేయగా, అందులో తెలంగాణలో 21 స్టేషన్లు ఉన్నాయి. ఆ 21లో జనగామకు చోటు దక్కింది. జనగామ రైల్వే స్టేషన్ రూపు రేఖలు మార్చనున్నట్లు ఆఫీసర్లు చెప్పారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఆ వెంటనే తొలివిడతలో రూ.24కోట్ల 50లక్షలు రిలీజ్​చేశారు. బ్యూటిఫికేషన్​లో భాగంగా ప్లాట్​ఫామ్స్ రిపేర్లు, అడిషనల్ కవర్ షెడ్, కొత్తగా టాయిలెట్లు, బుకింగ్​కౌంటర్లు, వెయిటింగ్ హాళ్లు నిర్మించాల్సి ఉంది.

ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ఏడాది ఆగస్టు 6న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్​గా స్టేషన్​పనులను ప్రారంభించినప్పటికీ, కొన్ని పనులే మొదలయ్యాయి. అవి కూడా స్లోగా సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు లేబర్ పై భారం వేసి తూతూ మంత్రంగా పనులు కానిచ్చేస్తున్నారు.

స్టేషన్​ముందు భాగంలో నిర్మిస్తున్న గార్డెనింగ్​వాల్స్ కు కనీసం వాటర్ క్యూరింగ్​కూడా సరిగా చేయడం లేదు. ఇసుక, కంకర మోతాదులో కలపడం లేదు. నాసిరకంగా పనులు చేస్తున్నారు. ఇప్పటికే కట్టిన కొన్ని గార్డెనింగ్ ​వాల్స్​కూలాయి. వాటిని కవర్​చేస్తూ మళ్లీ ప్యాచ్​వర్క్​ చేస్తున్నారు.